Bihar: ప్రతిపక్షం నన్ను అంతం చేయాలని చూస్తోంది: మోదీ
- ప్రజా సంకల్ప్ ర్యాలీలో మోదీ నిప్పులు
- పాకిస్థాన్‌కు లబ్ధి చేకూరేలా ప్రతిపక్షాల ప్రవర్తన ఉందన్న ప్రధాని
- బీహార్‌ను నితీశ్ చీకటి రోజుల నుంచి బయటపడేశారంటూ ప్రశంసలు
కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్ష కూటమిపై ప్రధాని నరేంద్రమోదీ మరోమారు విరుచుకుపడ్డారు. బీహార్‌లోని పాట్నాలో ఆదివారం నిర్వహించిన ఎన్డీయే సంకల్ప్ ర్యాలీలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ.. తాను ఉగ్రవాదాన్ని అంతం చేయాలనుకుంటే.. కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతిపక్షాల కూటమి తనను అంతం చేసేందుకు కుట్ర పన్నుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల తీరు పాకిస్థాన్‌కు రక్షణ కవచంగా మారుతోందని అన్నారు. ఉగ్రవాద ఆరోపణల నుంచి తప్పించుకునేందుకు పాకిస్థాన్‌కు మన ప్రతిపక్ష నేతల ప్రకటనలు చక్కగా ఉపయోగపడుతున్నాయన్నారు. వీరి ఆరోపణలకు వారు సంతోషంతో చప్పట్లు కొడుతున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
పేదల సంక్షేమం పేరిట రాజకీయ దుకాణాలు నడుపుకుంటూ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడం తప్ప ఇంకేమీ చేయని కొందరు నాయకులకు కాపలాదారులతో సమస్యేనని కాంగ్రెస్ చీఫ్ రాహుల్‌ను ఉద్దేశించి విమర్శించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్‌లు కలిసి బీహార్‌ను చీకటి రోజుల నుంచి బయటపడేశారని, వారికి అభినందనలు తెలుపుతున్నట్టు మోదీ పేర్కొన్నారు.