KTR: చంద్రబాబుకు అసలు సిగ్గుందా?: కేటీఆర్
- ఐటీ గ్రిడ్ సంస్థ తప్పు చేయకపోతే చంద్రబాబుకు భయం ఎందుకు?
- ఎక్కడ ఫిర్యాదు వస్తే అక్కడే కేసు నమోదవుతుందని తెలియదా?
- లోకేశ్ కు కూడా తండ్రి బుద్ధులొచ్చాయన్న కేటీఆర్
హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ తప్పు చేయకపోతే ఏపీ సీఎం చంద్రబాబుకు భయం ఎందుకని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఉదయం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్, తమ ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడానికి చంద్రబాబుకు సిగ్గుండాలని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో పార్టీలు మారడం తప్పుకాదని, చంద్రబాబు కూడా పార్టీ మారిన వ్యక్తేనని అన్న ఆయన, బుకాయింపు మాటలు చెబుతూ, ప్రజలను మోసం చేయడమే తప్పని అన్నారు.
తన తండ్రికి తగ్గట్టుగానే లోకేశ్ కూడా బుకాయించడాన్ని వంటబట్టించుకున్నారని నిప్పులు చెరిగారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరకలేదా? అని ప్రశ్నించిన కేటీఆర్, ఏపీకి చెందిన వ్యక్తి తెలంగాణలో ఫిర్యాదు చేసినా, ముంబైలో ఫిర్యాదు చేసినా, ఫిర్యాదు చేసిన చోటనే కేసు నమోదవుతుందన్న కనీస ఇంగిత జ్ఞానం చంద్రబాబుకు లేకపోయిందని ధ్వజమెత్తారు.
ఇక్కడున్న ఓ సంస్థ నిర్వాకాలపై ఫిర్యాదు వస్తే స్పందించడం, కేసు పెట్టి విచారించడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించారన్న ఫిర్యాదు నిజమేనని తెలుస్తోందని, దీనిపై పూర్తి వివరాలు విచారణ తరువాతే వెలుగులోకి వస్తాయని అన్నారు.