it grid: ‘ఐటీ గ్రిడ్’ ఉద్యోగుల మిస్సింగ్ వ్యవహారం.. హెబియస్ కార్పస్ పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు!
- ఈ పరిస్థితిలో జోక్యం చేసుకోలేమన్న కోర్టు
- కేసు విచారణ కొనసాగుతుందని స్పష్టీకరణ
- నలుగురు ఉద్యోగులను విడిచిపెట్టిన పోలీసులు
తెలుగుదేశం పార్టీకి సేవలు అందిస్తున్న ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగుల మిస్సింగ్ వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. ఈ కేసు దర్యాప్తులో తాము జోక్యం చేసుకోలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఐటీ గ్రిడ్ సంస్థ ఉద్యోగి దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ ను కొట్టివేస్తున్నట్లు పేర్కొంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణ కొనసాగుతుందని హైకోర్టు తేల్చిచెప్పింది.
ఈ సందర్భంగా తెలంగాణ ఐజీ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. ఐటీ గ్రిడ్ సంస్థకు చెందిన నలుగురు ఉద్యోగులను అరెస్ట్ చేయలేదని కోర్టుకు తెలిపారు. విచారణలో భాగంగానే నలుగురు ఉద్యోగులను పిలిపించామని స్పష్టం చేశారు. కాగా, హైకోర్టు పిటిషన్ ను కొట్టివేసిన అనంతరం నలుగురు ఐటీ గ్రిడ్ ఉద్యోగులను పోలీసులు విడిచిపెట్టినట్లు ప్రసాద్ పేర్కొన్నారు.