Telangana: సొంత ఎమ్మెల్యేలనే కాంగ్రెస్ నమ్మడం లేదు.. పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేస్తే రూ.50 లక్షలు ఇస్తామన్నారు!: రేగ కాంతారావు
- మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
- టీఆర్ఎస్ లో చేరితే పదవికి రాజీనామా చేస్తా
- హైదరాబాద్ లో మీడియాతో పినపాక ఎమ్మెల్యే
నిన్న అత్యవసరంగా జరిగిన సీఎల్పీ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగ కాంతారావు, ఆత్రం సక్కు డుమ్మా కొట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. దీంతో ఇద్దరు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగుతామని, దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఈరోజు ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని కాంతారావు తెలిపారు. సీఎం కేసీఆర్ తో కలిసి నడవాలని తాము నిర్ణయించుకున్నామని స్పష్టం చేశారు. ఒకవేళ టీఆర్ఎస్ కండువా కప్పుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని తేల్చిచెప్పారు. తాము అమ్ముడుపోయామని కాంగ్రెస్ నేతలు సిగ్గుమాలిన ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసుల ఆత్మగౌరవం దెబ్బతినేలా నేతలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేతలకు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే నమ్మకం లేదని కాంతారావు విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి ఓటువేస్తే రూ.50 లక్షలు ఇస్తామని ఆశచూపారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలో 16 మంది ఎమ్మెల్యేలు ఉంటే, అందులోనే నాలుగు గ్రూపులు ఉన్నాయని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ నేతలు తమకు వ్యతిరేకంగా ధర్నాలు ఎలా చేస్తారో చూస్తామని సవాలు చేశారు.