it grid: ‘ఐటీ గ్రిడ్’ ప్రజల సమాచారాన్ని దుర్వినియోగం చేస్తోంది.. ఈ కేసులో ఏపీ పోలీసులు వేలు పెట్టద్దు!: సైబరాబాద్ సీపీ సజ్జనార్
- ఈ కంపెనీ ఉద్యోగులను 2 రోజులు విచారించాం
- హార్డ్ డిస్కులను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపాం
- మీడియాతో మాట్లాడిన సజ్జనార్
ఏపీ, తెలంగాణ మధ్య కాకరేపుతున్న ‘ఐటీ గ్రిడ్’ కంపెనీ వ్యవహారంలో సైబరాబాద్ సీపీ సజ్జనార్ ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఈ కంపెనీ భద్రపరిచినట్లు తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. తాము చేపట్టిన విచారణలో ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ఐటీ గ్రిడ్ కంపెనీ దుర్వినియోగం చేస్తున్నట్లు తేలిందన్నారు. ఈ కేసుకు సంబంధించి నలుగురు ఉద్యోగులను రెండు రోజుల పాటు విచారించామని పేర్కొన్నారు.
ఐటీ గ్రిడ్ కంపెనీ నుంచి హార్డ్ డ్రైవ్స్, ల్యాప్ టాప్ లతో పాటు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నామని సజ్జనార్ అన్నారు. ఈ సాక్ష్యాలను విశ్లేషించేందుకు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపుతామన్నారు. ఐటీ గ్రిడ్ కంపెనీకి క్లౌడ్ సేవలు అందిస్తున్న అమెజాన్ సంస్థకు కూడా నోటీసులు పంపామని తెలిపారు. అలాగే అదనపు సమాచారం కోసం ఏపీ ఎన్నికల సంఘానికి, భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ)కి లేఖ రాశామన్నారు.
ఈ కేసులో ఐటీ గ్రిడ్ కంపెనీ డైరెక్టర్ అశోక్ ప్రధాన నిందితుడని, అతను లొంగిపోతేనే సేవా మిత్ర యాప్ వివరాలన్నీ తెలుస్తాయని వ్యాఖ్యానించారు. తెలంగాణ పోలీసుల విచారణలో వేలు పెట్టవద్దని ఏపీ పోలీస్ అధికారులకు సజ్జనార్ సూచించారు. ఈ డేటాతో ఎవరినైనా వ్యక్తిగతంగా బ్లాక్ మెయిల్ చేయొచ్చని చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరినైనా విచారణకు పిలిపిస్తామని తెలిపారు.