Pakistan: దాడి సమయంలో 300 ఫోన్లు యాక్టివ్.. హతమైన ఉగ్రవాదుల సంఖ్య పక్కా అన్నట్టేనా?
- బాలకోట్‌లోని జైషే ఉగ్రస్థావరంపై భారత వాయుసేన దాడి
- దాడిలో కనీసం 300 మంది మరణించి ఉంటారనేదానికి సాక్ష్యం
- ఆ సమయంలో 300 ఫోన్లు పనిచేస్తున్నట్టు చెప్పిన ఎన్టీఆర్వో
పాక్‌లోని ఉగ్రస్థావరాలపై భారత వాయుసేన జరిపిన దాడిలో మరణించిన ఉగ్రవాదుల సంఖ్యపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తుండగా, దాడిలో కనీసం 300 మంది ఉగ్రవాదులు హతమై ఉంటారనేందుకు సరికొత్త సాక్ష్యం వెలుగుచూసింది.
బాలాకోట్‌లోని జైషే మహ్మద్ ఉగ్రస్థావరంపై భారత యుద్ధ విమానాలు బాంబుల వర్షం కురిపించిన సమయంలో దాదాపు 300 మొబైల్ ఫోన్లు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయని జాతీయ సాంకేతిక అధ్యయన సంస్థ (ఎన్టీఆర్వో) తెలిపింది. ఆ సమయంలో సెల్ఫోన్లు వాడుతున్న వారి సంఖ్య మాత్రమే అదని, వాడని వారు మరింతమంది ఉండి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. దీనిని బట్టి చూస్తే దాడిలో వారంతా మరణించే ఉండొచ్చని, కొందరు తప్పించుకున్నా సంఖ్య మాత్రం 300కు తగ్గే అవకాశం లేదని చెబుతున్నారు.