Reliance: ఫోర్బ్స్ జాబితాలో ఆరు స్థానాలు జంప్ చేసిన ముఖేష్ అంబానీ
- లేటెస్ట్ ర్యాంక్ 13
- 2018లో 19వ స్థానంలో ఉన్న రిలయన్స్ అధినేత
- వరల్డ్ నం.1గా మరోసారి జెఫ్ బెజోస్
భారత అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఫోర్బ్స్ అత్యంత సంపన్నుల జాబితాలో 13వ స్థానానికి చేరారు. 2019 జాబితాలో ఆయన ఒక్కసారిగా 6 స్థానాలు ఎగబాకడం విశేషం. ఫోర్బ్స్ అంతర్జాతీయ మ్యాగజైన్ తాజాగా విడుదల చేసిన కుబేరుల జాబితాలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కు మరోసారి అగ్రస్థానం దక్కింది. ముఖేష్ అంబానీ ఆస్తి విలువను ఫోర్బ్స్ 50 బిలియన్ డాలర్లుగా లెక్క కట్టింది. 2018లో అంబానీ సంపద 40.1 బిలియన్ డాలర్లుగా తెలిపింది. అదే సమయంలో జెఫ్ బెజోస్ సంపద 131 బిలియన్ డాలర్లని పేర్కొంది ఫోర్బ్స్ మ్యాగజైన్.
ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ దిగ్గజం బిల్ గేట్స్, ఇన్వెస్ట్ మెంట్స్ కింగ్ వారెన్ బఫెట్ తదితరులు బెజోస్ కు దిగువన ఉన్నారు. ఫోర్బ్స్ జాబితాలో భారత్ నుంచి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా 122వ స్థానం, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 167వ స్థానం, ఎయిర్ టెల్ యజమాని సునీల్ మిట్టల్ 244వ స్థానం దక్కించుకున్నారు. ఇక, ఫేస్ బుక్ అధినేత మార్క్ జుకర్ బెర్గ్ మూడు స్థానాలు దిగజారి 8వ స్థానంలో నిలిచారు.