Justice K.Ramaswamy: బొమ్మై కేసులో చారిత్రక తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కె.రామస్వామి కన్నుమూత
- ఇటీవల వాకింగ్ చేస్తూ గాయపడిన జస్టిస్ కె.రామస్వామి
- నిద్రలోనే తుది శ్వాస విడిచిన వైనం
- 1989 నుంచి 1997 వరకు సుప్రీం న్యాయమూర్తిగా సేవలు
ఇటీవల వాకింగ్ చేస్తూ అదుపు తప్పి కిందపడి అస్వస్థతకు గురైన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కె.రామస్వామి (87) బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. హైదరాబాద్‌లోని తన కుమార్తె ఇంట్లో ఉంటున్న ఆయన నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య శ్యామలాదేవి 1998లోనే మృతి చెందారు.
13 జూలై 1932లో పశ్చిమగోదావరి జిల్లా బట్లమగటూరులో జన్మించిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 1989 నుంచి 1997 వరకు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఎస్సార్ బొమ్మై కేసులో చారిత్రక తీర్పు ఇచ్చి అందరి దృష్టినీ ఆకర్షించారు. కేసు ఏదైనా వాదోపవాదాలు పూర్తయిన వెంటనే రామస్వామి తీర్పులు ఇచ్చేవారని న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు.
జస్టిస్ రామస్వామి మరణవార్త తెలిసిన వెంటనే తెలంగాణ సీజే రాధాకృష్ణన్, న్యాయమూర్తులు రాఘవేంద్రసింగ్, రాజశేఖర్‌రెడ్డి, అమర్నాథ్గౌడ్, సి.కోదండరాం, సంజయ్‌కుమార్, లాయర్ల యూనియన్ సభ్యుడు పార్థసారథి తదితరులు దోమల్‌గూడలోని ఆయన నివాసానికి వెళ్లి నివాళులర్పించారు.