Chandrababu: తెలుగుదేశం పార్టీ చోటా నేతకు స్వయంగా ఫోన్ చేసిన చంద్రబాబు!
- టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు
- చాట్రాయి స్థానిక నేతకు ఫోన్
- ఓటు బ్యాంకును పెంచాలని సూచన
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను నిలపడం ద్వారా విజయమే లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, చిన్న చిన్న నాయకులను సైతం పేరుపేరునా పలకరిస్తూ, వారివారి నియోజకవర్గాల సమాచారాన్ని తెలుసుకుంటున్నారు. నిత్యమూ ఆయన జరిపే టెలి కాన్ఫరెన్స్ లో భాగంగా ఓ చోటా నేతకు చంద్రబాబు ఫోన్ చేసి పార్టీ పరిస్థితిపై వాకబు చేయడం గమనార్హం.
పార్టీలో జిల్లా పరిధిలో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న మందపాటి బసవారెడ్డి అనే వ్యక్తికి ఫోన్ చేసిన బాబు, ఎన్నికల్లో గెలుపోటములపై మాట్లాడారు. పింఛన్లు పెంచడం పసుపు, కుంకుమ, అన్నదాత సుఖీభవ వంటి పథకాలతో టీడీపీకి ప్రజల్లో ఆదరణ పెరిగిందని చెప్పిన ఆయన, చాట్రాయి పరిధిలో ఓటర్లు గతంలో వైఎస్ఆర్ సీపీకి అనుకూలంగా ఉండేవారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని చెప్పారు.
నియోజకవర్గ నేతలు సమర్థవంతంగా పనిచేస్తున్నారని బసవారెడ్డి చెప్పడంతో, ఆయన చాలా అర్థవంతంగా మాట్లాడారని చంద్రబాబు కితాబిచ్చారు. ఓటుబ్యాంకును పెంచేందుకు కృషి చేయాలని, ఎన్నో కారణాలతో పార్టీకి దూరంగా ఉంటున్న ప్రజలకు దగ్గర కావాలని సూచించారు.