Narendra Modi: చిట్టచివరి క్యాబినెట్ భేటీకి నరేంద్ర మోదీ సిద్ధం!
- అతి త్వరలో ఎన్నికల షెడ్యూల్
- ఓటర్లకు తాయిలాలు ప్రకటించనున్న ఎన్డీయే
- అగ్ర కోటా అమలుకు రూ. 4 వేల కోట్లు!
- నిర్ణయం తీసుకోనున్న మోదీ సర్కార్
మరికొన్ని రోజుల్లో ఎన్నికల కమిషన్ లోక్ సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను వెలువరించనున్న నేపథ్యంలో, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నేడు కీలకమైన కేబినెట్ భేటీ జరగనుంది. ఈ ప్రభుత్వానికి ఇదే చివరి క్యాబినెట్ భేటీ అని తెలుస్తుండటంతో, ఓటర్లను ఆకట్టుకునేలా పలు తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందని ఎన్డీయే వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ఉన్నత విద్యా సంస్ధల్లో అగ్రవర్ణ పేదలకు పది శాతం కోటా అమలు నిమిత్తం రూ. 4000 కోట్ల అదనపు కేటాయింపులకు మంత్రి మండలి పచ్చజెండా ఊపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీల రిజర్వేషన్ లకు సంబంధించి 200 పాయింట్ రోస్టర్ వ్యవస్థ పునరుద్ధరణ ఆర్డినెన్స్ పైనా నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను వెలువరించేలోగానే ప్రజలను ఆకట్టుకునే నిర్ణయాలను తీసుకోవాలని మోదీ సర్కారు భావిస్తోంది. కాగా, 9 లేదా 11న ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఆ వెంటనే కోడ్ అమలులోకి రానుండటంతో ఈలోగానే జాగ్రత్త పడాలని మోదీ సర్కారు నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.