Chandrababu: విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు చూపు ఎటు వైపు?

  • ఉత్తర విశాఖ టికెట్‌ ఇస్తే పార్టీ మారేందుకు సిద్ధమవుతున్న సిట్టింగ్‌
  • టీడీపీ నుంచి అందని సానుకూల సంకేతాలు
  •  రెండురోజుల క్రితం సీఎం చంద్రబాబును కలవడంతో ఊహాగానాల జోరు

విశాఖ ఉత్తర నియోజక వర్గం ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభా పక్షం నేత పెన్మత్స విష్ణుకుమార్‌రాజు చూపు ఎటువైపు అన్న చర్చసాగుతోంది. తాజాగా  ఆయన అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడంతో చర్చలు మరింత జోరందుకున్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం పార్టీలు జత కట్టడంతో విష్ణుకుమార్‌రాజు పంటపండింది.

మిత్రపక్షాలకు సీట్ల కేటాయింపులో భాగంగా ఈ స్థానాన్ని టీడీపీ బీజేపీకి వదులుకుంది. వ్యాపారవేత్తగా, బీజేపీ నాయకునిగా ఉన్నా అప్పటికి అంతగా గుర్తింపులేని విష్ణుకుమార్‌రాజుకు అదృష్టం కలిసివచ్చింది. పార్టీ ఆయనకు టికెట్‌ కేటాయించడంతో ఎమ్మెల్యే, ఆ తర్వాత శాసనసభా పక్షం నేత అయిపోయారు.

 ఇప్పుడు విష్ణుకుమార్‌రాజు పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. టీడీపీ, బీజేపీ మధ్య కటీఫ్‌ కావడం, ఉత్తరంలో ఒంటరిగా పోటీ చేస్తే గెలుస్తానన్న నమ్మకం లేకపోవడంతో ఆయన గత కొంతకాలంగా అధికార పార్టీ వైపు చూస్తున్నారన్న వార్తలు ఉన్నాయి. సీఎం నుంచి సరైన హామీ లభిస్తే ఆయన పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్నారన్న ఊహాగానాలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అమరావతిలో ఆయన సీఎంను కలవడం చర్చకు దారితీసింది. నియోజకవర్గం అభివృద్ధి పనులు, నిధుల వ్యవహారం కోసమే సీఎంను కలిశానని, రాజకీయ ప్రాధాన్యం లేదని ఆయన చెబుతున్నా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఈ మాటల్ని ఎవరూ విశ్వసించడం లేదు.

ఉత్తరం నుంచి విష్ణుకుమార్‌ రాజుకు టికెట్‌ ఇవ్వడాన్ని స్థానిక టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న తమలోనే ఎవరో ఒకరికి టికెట్‌ ఇవ్వాలని, విష్ణుకుమార్‌రాజుకు ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని బాహాటంగా ప్రకటిస్తున్నారు. సీఎంతో రాజు భేటీ అయిన విషయంపై వార్తలు రావడంతో అధిష్ఠానం ఎక్కడ అతనివైపు మొగ్గు చూపుతుందో అని బుధవారం ఏకంగా బస్సులో నియోజకవర్గం నాయకులంతా అమరావతి ప్రయాణమై వెళ్లారు.

విష్ణుకుమార్‌రాజుకు టికెట్‌ ఇస్తే వ్యతిరేకంగా పనిచేస్తామని అధిష్ఠానం ముందు చెబుతామని బయలుదేరే ముందు వారు విలేకరులకు తెలిపారు. ఈ పరిస్థితుల్లో అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందన్న ఉత్కంఠ సాగుతోంది. వాస్తవానికి విష్ణుకుమార్‌రాజును విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేయించే యోచనలో టీడీపీ అధిష్ఠానం ఉందని తెలుస్తోంది. దీనిపై స్పష్టమైన సమాచారం ఉండడం వల్లే ఎమ్మెల్యే సీఎంను కలిసి చర్చించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎప్పటికప్పుడు అంతుచిక్కని రీతిలో పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేసే విష్ణుకుమార్‌రాజు ఈసారి ఎలా వ్యవహరిస్తారో చూడాలి మరి.

  • Loading...

More Telugu News