Andhra Pradesh: ఓట్ల తొలగింపులో జగన్ ఏ-1 నిందితుడు..ప్రజలంతా ఆయన్ను నిలదీయాలి!: సీఎం చంద్రబాబు పిలుపు
- ఫామ్-7 దుర్వినియోగం చేశానని జగన్ ఒప్పుకున్నారు
- 2004-09 కాలంలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారు
- కుట్రలను ఎలా కట్టడి చేయాలో నాకు తెలుసు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ అధినేత జగన్ పై ఈరోజు మండిపడ్డారు. ఓట్ల తొలగింపులో వైఎస్ జగన్ ఏ-1 నిందితుడని ఆయన ఆరోపించారు. ఫామ్-7ను దుర్వినియోగం చేసినట్లు జగనే ఒప్పుకున్నారని గుర్తుచేశారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచే ఫామ్-7 కుట్రలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి ఓట్లు గల్లంతయిన వాళ్లంతా జగన్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు.
2004-09 మధ్యకాలంలో రౌడీయిజంతో రాష్ట్రానికి అప్రతిష్ట వచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆ ఐదేళ్ల కాలంలో ఫ్యాక్షనిస్టులు పేట్రేగిపోయారన్నారు. కానీ టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఫ్యాక్షన్ ను నియంత్రించామని అన్నారు. కానీ ఇప్పుడు కొందరు కుట్రపూరితంగా, బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. వీరిని ఎలా కట్టడి చేయాలో తనకు తెలుసని స్పష్టం చేశారు.
రాబోయే ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తేనే ఏపీ అభివృద్ధి ఓ కొలిక్కి వచ్చి సంక్షేమం కొనసాగుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రాష్ట్రం దొంగలపాలు అవుతుందని హెచ్చరించారు. ఈ మేరకు చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు.