Andhra Pradesh: పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీలో జగన్ నిందితుడు.. ఆ స్కూలులో ఎవరిని అడిగినా ఈ విషయం చెబుతారు!: మంత్రి దేవినేని ఉమ
- జగన్ ను ఈ వ్యవహారంలో వైఎస్ కాపాడారు
- వైఎస్ కుటుంబం మొత్తం ఫ్యాక్షన్ మెంటాలిటీ ఉంది
- వైసీపీ అధినేతపై నిప్పులు చెరిగిన మంత్రి దేవినేని
ఆంధ్రప్రదేశ్ లో 54 లక్షల నకిలీ ఓట్లు ఉన్నాయని వైసీపీ అధినేత ఢిల్లీకి వెళ్లి ప్రకటన చేశారని ఏపీ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. తెలంగాణలో 24 లక్షల ఓట్లను తొలగించి గెలిచిన కేసీఆర్ ఏ ముఖంతో తైతక్కలాడుతున్నారని ప్రశ్నించారు. టీడీపీకి సేవలు అందిస్తున్న సంస్థల ఆఫీసుల్లో దుర్మార్గంగా ప్రవేశించిన పోలీసులు, ఎఫ్ఐఆర్ నమోదు చేయకుండా కంప్యూటర్లు ఎత్తుకెళ్లారని ఆరోపించారు. విజయవాడలో ఈరోజు కలెక్టర్ ఇంతియాజ్ కు ఓట్ల తొలగింపుపై ఫిర్యాదు చేసిన టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు.
జగన్, విజయసాయిరెడ్డి, జగన్ బావ లోకేశ్వర్ రెడ్డి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడ్డారని మంత్రి దేవినేని ఉమ ఆగ్రహం వ్యక్తం చేశారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకైన కేసులో జగన్ మోహన్ రెడ్డి నిందితుడిగా ఉన్నారని ఆరోపించారు.
ఈ విషయాన్ని హైదరాబాద్ పబ్లిక్ స్కూలు(హెచ్ పీఎస్)లో ఎవరిని అడిగినా చెబుతారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో జగన్ ను ఆయన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కాపాడారని ఉమ పేర్కొన్నారు. ఆ తర్వాత టెలీఫోన్ కుంభకోణంలో జగన్ బావ అనీల్ కుమార్ కోట్లాది రూపాయలు అర్జించారని అన్నారు.
వైఎస్ కుటుంబం మొత్తం ఓ ఫ్యాక్షన్ మెంటాలిటీతో ఉందని దుయ్యబట్టారు. పదవి కోసం వైఎస్ హైదరాబాద్ లో మతఘర్షణలను రెచ్చగొట్టారని విమర్శించారు. ఆయన కుమారుడైన జగన్ తన క్రిమినల్ మెంటాలిటీతో వైసీపీ శ్రేణులందరినీ ఓట్ల తొలగింపు కుట్రలో భాగస్వాములను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజల ఓట్లను తొలగించే హక్కు వైసీపీ, జగన్ కు లేదని స్పష్టం చేశారు. ప్రజల హక్కును కాపాడాల్సిందిగా కలెక్టర్ ఇంతియాజ్ కు ఫిర్యాదు చేశామన్నారు. ఈరోజు కమిషనర్ ఆఫ్ పోలీస్, ఎస్పీలకు కూడా ఈ వ్యవహారంపై ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.