Elections: ఎన్నికల షెడ్యూల్ అలస్యమవుతోందన్న విమర్శలపై ఈసీ వివరణ!
- ఎన్నికల వేళ ఓటర్లకు తాయిలాలు
- మోదీకి లబ్ది చేసేందుకే ఆలస్యమంటున్న విపక్షాలు
- తమ షెడ్యూల్ తమకుందన్న ఈసీ
నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారుకు లబ్ధి కలిగించాలన్న ఆలోచనతో, ఉద్దేశపూర్వకంగానే ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ ను విడుదల చేయకుండా ఆలస్యం చేస్తోందని విపక్షాలు చేస్తున్న విమర్శలపై ఉన్నతాధికారి ఒకరు స్పందించారు. ఎన్నికలు నిర్వహించేందుకు తమ వద్ద చాలినంత సమయం ఉందని, కొన్ని రాజకీయ పార్టీలు అనాలోచితంగానే విమర్శలు చేస్తున్నాయని ఎన్నికల కమిషన్ కు చెందిన ఉన్నతాధికారి ఒకరు 'ఎన్డీటీవీ'కి వెల్లడించారు.
ప్రధాని షెడ్యూల్ తో తమకు సంబంధం లేదని, తమ షెడ్యూల్ తమకుందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. కాగా, 2014లో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ మార్చి 5నే వెల్లడైన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ముందు మోదీ సర్కారు మరిన్ని పథకాలను ప్రవేశ పెట్టడం ద్వారా, ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తోందని, అందుకు ఈసీ సహకరిస్తోందని కాంగ్రెస్ సహా విపక్షాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.