Andhra Pradesh: ‘సేవా మిత్ర’లో తెలంగాణ వ్యక్తుల డేటా కూడా ఉంది: సిట్ ఇన్ ఛార్జి స్టీఫెన్ రవీంద్ర
- ఈ డేటా ఎందుకుందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నాం
- ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ కోసం గాలిస్తున్నాం
- నిందితులు అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా కూడా పట్టుకుంటాం
సేవా మిత్ర యాప్ లో తెలంగాణ వ్యక్తుల డేటా కూడా ఉందని సిట్ ఇన్ ఛార్జి స్టీఫెన్ రవీంద్ర పేర్కొన్నారు. డేటా చోరీ కేసుకు సంబంధించి హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాప్ లో తెలంగాణ ప్రజల డేటా ఎందుకుందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసిన తర్వాత ఈ యాప్ లో కొన్ని ఫీచర్స్ ను డిసేబుల్ చేశారని అన్నారు.
డేటా ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు ఇచ్చారు? అనే దానిపై దృష్టి పెట్టామని, ఐటీ గ్రిడ్స్ సంస్థ ఎండీ అశోక్ పట్టుబడితే అన్ని విషయాలు బయటకొస్తాయని అన్నారు. అశోక్ కోసం గాలిస్తున్నామని, ఈ కేసులో నిందితులు అమెరికాలో ఉన్నా, అమరావతిలో ఉన్నా కూడా పట్టుకుంటామని చెప్పారు. అమెజాన్, గూగుల్ సంస్థల నుంచి సమాధానాలు రావాల్సి ఉన్నాయని స్టీఫెన్ రవీంద్ర అన్నారు.