China: ఆహా.. ఏమి నిగ్రహం చూపించారు!.. పాకిస్థాన్ ను వేనోళ్ల కొనియాడిన చైనా!
- భారత్ తో మీరు వ్యవహరించిన తీరు భేష్
- ప్రస్తుత స్థితిని నిశితంగా పరిశీలించాం
- చైనా అవకాశవాద ప్రకటన
స్వీయ ప్రయోజనాల కోసం చైనా, భారత్ ను ఇరకాటంలోకి నెట్టడానికి పాకిస్థాన్... ఎలాంటి చర్యలకైనా వెనుకాడవన్నది అందరికీ తెలిసిన విషయమే. అందుకు ఈ ప్రకటనే నిదర్శనం. చైనా విదేశాంగ మంత్రి కాంగ్ ఝువాన్యు తాజాగా పాక్ లో అడుగుపెట్టారు. ఆయన పర్యటన నేపథ్యంలో చైనా తనకు అలవాటైన రీతిలో పాకిస్థాన్ ఉబ్బితబ్బిబ్బయ్యేలా ఓ ప్రకటన చేసింది.
పుల్వామా ఉగ్రదాడుల అనంతరం మీరు చూపించిన నిగ్రహం అసామాన్యం అంటూ కొనియాడింది. పాకిస్థాన్, భారత్ ల మధ్య ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను చైనా నిశితంగా పరిశీలించిందని, ఎంతో ఉద్రిక్త పరిస్థితుల్లోనూ పాకిస్థాన్ సంయమనం పాటించిన తీరు తమను విశేషంగా ఆకట్టుకున్నదని ఆ ప్రకటనలో పేర్కొంది. ముఖ్యంగా, భారత్ తో సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకునేందుకు పాక్ చూపిస్తున్న తపన తమను ముగ్ధుల్ని చేసిందని తెలిపింది.
కొంతకాలంగా ప్రపంచ వాణిజ్య విపణిని తన గుప్పిట్లో పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న చైనా... అనేక దేశాలను కలుపుతూ పాకిస్థాన్ భూభాగం మీదుగా భారీ రహదారిని నిర్మించాలని తలపోస్తోంది. అయితే ఆ రహదారి పాక్ ఆక్రమిత కశ్మీర్ గుండా వెళుతుంది. దీన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ కు వ్యూహాత్మక మద్ధతు ఇస్తోంది చైనా.