Andhra Pradesh: ప్రజలకు వైఎస్ జగన్ క్షమాపణలు చెప్పాలి: టీడీపీ నేత జీవీ ఆంజనేయులు
- బీజేపీ కుట్రలో భాగంగానే గవర్నర్ ని జగన్ కలిశారు
- సీఎం పదవి కోసం దిగజారుడు రాజకీయాలు తగదు
- ఓట్లు తొలగించేందుకు జగన్ యత్నం
డేటా చోరీ కుంభకోణం, ఏపీలో ఓట్ల తొలగింపు అంశాలపై గవర్నర్ నరసింహన్ కు నిన్న జగన్ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై టీడీపీ నేత జీవీ ఆంజనేయులు స్పందిస్తూ, బీజేపీ కుట్రలో భాగంగానే గవర్నర్ ని జగన్ కలిశారని ఆరోపించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిన్న గవర్నర్ ని కలిసిన తర్వాత జగన్ కూడా భేటీ అయ్యారని, తెర వెనుక నుంచి బీజేపీ ఆడిస్తున్న నాటకమిదని దుయ్యబట్టారు.
ఏపీలో 8 లక్షల ఓట్లు తొలగించేందుకు, దొడ్డిదారిన అధికారంలోకి వచ్చేందుకు ప్రతిపక్ష నాయకుడు యత్నిస్తున్నారని ఆరోపించారు. సీఎం పదవి కోసం జగన్ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, గుంటూరు జిల్లాలో 1.17 లక్షల ఓట్లు తొలగించేందుకు యత్నించారని మండిపడ్డారు. సేవామిత్ర యాప్ డేటా చోరీ చేసిందే కాక, ఇంకా తమపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓట్లు తొలగించేందుకు యత్నిస్తున్న జగన్, ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.