Asaduddin Owaisi: ‘ఆస్క్ అసద్’లో నెటిజన్లతో హైదరాబాద్ ఎంపీ ముచ్చట్లు.. తానెక్కడున్నా ‘జై హింద్’ అనే అంటానన్న అసదుద్దీన్
- నేనెప్పుడూ జాతీయ గీతాన్ని వ్యతిరేకించలేదు
- బలహీన వర్గాలకు రాజ్యాధికారమే మా లక్ష్యం
- బిర్యానీ, హలీం అంటే ఇష్టం
‘ఆస్క్ అసద్’ పేరుతో గురువారం ట్విట్టర్ వేదికగా నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికర సమాధానాలు చెప్పారు. తాము అందరి కోసం పోరాడుతున్నామన్న అసద్.. అందరికీ న్యాయం జరగాలన్న లక్ష్యంతో భారతీయుడిగా లోక్‌సభలో తన వాణిని వినిపిస్తున్నట్టు చెప్పారు. హిందూత్వమంటే తనకు గౌరవమని పేర్కొన్నారు. తానెప్పుడు, ఏ పరిస్థితుల్లో ఉన్నా ‘జై హింద్’ అనే అంటానని, తానెప్పుడూ జాతీయ గీతాన్ని వ్యతిరేకించలేదని అన్నారు. అయితే, దానిని బలవంతంగా ఆలపించాలన్న దానినే తాను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పుకొచ్చారు.
బలహీన వర్గాలకు కూడా రాజ్యాధికారం రావాలన్నదే తమ అభిమతమని అసద్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో ఏడుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీకి మాత్రమే పరిమితం కావాలనుకోవడం లేదని, తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ, కర్ణాటక, బీహార్, మహారాష్ట్రలోనూ కార్యకలాపాలను విస్తరిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్ తరాలు తనను ఒక మంచి నాయకుడిగా గుర్తు పెట్టుకుంటే చాలని, అంతకుమించి ఇంకేమీ కోరుకోవడం లేదన్నారు.
జమ్ముకశ్మీర్‌లోని ప్రస్తుత పరిస్థితులపై నెటిజన్లు అడిగిన మరో ప్రశ్నకు అసద్ సమాధానం ఇస్తూ హింసను అరికట్టడం, రాంబో విధానాలను తగ్గించడం ద్వారా మాత్రమే అక్కడి పరిస్థితులను మెరుగుపర్చవచ్చన్నారు. బీజేపీ, కాంగ్రెస్ లు రెండూ ఒకటేనని, ఒకటి హిందూత్వను వేగంగా జనాలపై రుద్దుతుంటే మరోటి కాస్త నెమ్మదిగా రుద్దుతోందని విమర్శించారు. తనకు బిర్యానీ, హలీం రెండూ ఇష్టమేనని మరో ప్రశ్నకు సమాధానంగా అసద్ చెప్పుకొచ్చారు.