Telangana: ఇవాళ తెలంగాణ ఏం ఆలోచిస్తుందో దేశం కూడా అదే ఆలోచన చేస్తుంది: కేటీఆర్
- ‘రైతుబంధు’ను మిగిలిన రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయి
- కేసీఆర్ గొప్ప పరిపాలకుడు
- ఈ విషయాన్ని జైట్లీనే స్వయంగా నాతో చెప్పారు
రైతులకు మేలు చేసే పథకాలను తెలంగాణ తప్ప ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేపట్టలేదని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెదక్ లో నిర్వహించిన టీఆర్ఎస్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలోని రైతుబంధు పథకాన్ని ఇప్పుడు కేంద్రం, చాలా రాష్ట్రాలు కాపీ కొడుతున్నాయని విమర్శించారు. ఒకప్పుడు పశ్చిమ బెంగాల్ ఏం ఆలోచిస్తుందో దేశం మొత్తం అదే ఆలోచన చేసేదని చెప్పుకునేవారని, ఇప్పుడు పరిస్థితులు మారాయని, ఇవాళ తెలంగాణ ఏం ఆలోచిస్తుందో దేశం కూడా అదే ఆలోచిస్తుందని అంటున్నారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి నమూనాను దేశ వ్యాప్తంగా అమలు చేసే సత్తా ఉన్న నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. నాడు ఉద్యమకారుడైన కేసీఆర్ నేడు గొప్ప పరిపాలకుడయ్యారన్న విషయాన్ని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ స్వయంగా తనతో చెప్పారని గుర్తుచేసుకున్నారు.