BJP: పార్టీలో చేరి వారం కాలేదు... బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమితుడైన జయ్ పాండా
- ఒడిశా నేతకు కీలక పదవి
- జాతీయ ప్రతినిధిగానూ అపాయింట్ మెంట్
- అమిత్ షా ప్రకటన
బీజేపీ అధినాయకత్వం లోక్ సభ ఎన్నికలపై పూర్తిస్థాయిలో దృష్టి సారించింది. అందుకే ప్రాంతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న నేతలను సైతం పార్టీలో కీలక పదవుల్లో నియమించడం ద్వారా ఇతర ముఖ్యమైన నేతలపై ఆకర్షణ వల విసురుతున్నారు. ఈ క్రమంలో ఒడిశాలో ఎంతో పట్టున్న బైజయంత్ 'జయ్' పాండాను ఏకంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధినేత అమిత్ షా కీలక ప్రకటన చేశారు. అంతేకాదు, జయ్ పాండాకు పార్టీ జాతీయ అధికార ప్రతినిధి బాధ్యతలు కూడా అప్పగించారు.
ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే.. ఒడిశాలో మీడియా టైకూన్ గా పేరుగాంచిన జయ్ పాండా బీజేపీలో చేరి వారం కూడా లేదు. ఆయన మార్చి 4న కాషాయ కండువా కప్పుకున్నారు. బైజయంత్ పాండా ఒడిశాలోని కేంద్రపార లోక్ సభ స్థానం నుంచి 2009, 2014 ఎన్నికల్లో విజయం సాధించి పార్లమెంటులో అడుగుపెట్టారు. అంతేకాదు, ఆయన రెండు పర్యాయాలు రాజ్యసభ సభ్యుడిగానూ వ్యవహరించారు.
అయితే, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడంటూ నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బిజూ జనతాదళ్ (బీజేడీ) నుంచి పాండాకు గతేడాది ఉద్వాసన పలికారు. ఆయన ఒడిశా రాజకీయ, పాత్రికేయ వర్గాల్లో జయ్ పాండాగా సుప్రసిద్ధుడు.