Andhra Pradesh: నేడు, లేదా ఎల్లుండి ఎన్నికల షెడ్యూల్... ఏపీ, టీఎస్ లో ఎన్నికల తేదీలపై లీకులు!
- ఏప్రిల్ 15న ఎన్నికలు
- తెలుగు రాష్ట్రాల్లో ఒకేసారి
- షెడ్యూల్ వెలువడితేనే స్పష్టత
దేశవ్యాప్తంగా లోక్ సభ, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నేడు లేదా సోమవారం నాడు షెడ్యూల్ ను విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. 2014 ఎన్నికల వేళ, మార్చి 5నే షెడ్యూల్ రాగా, ఈ దఫా ఇప్పటికే ఆలస్యమైందని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఎన్డీయే సర్కారు యూనివర్సిటీల్లో పదోన్నతుల విషయంలో రిజర్వేషన్లు కల్పించేందుకు సంబంధించిన ఆర్డినెన్స్ ను జారీ చేయాల్సి వున్నందున దానికోసమే షెడ్యూల్ ప్రకటన ఆలస్యం చేస్తున్నారని సమాచారం. ఈ ఉదయం ఆర్డినెన్స్ జారీ అయితే, సాయంత్రంగా, లేకుంటే సోమవారం నాడు ఈసీ షెడ్యూల్ ను ప్రకటించ వచ్చని ప్రముఖ దినపత్రికలు వార్తలను ప్రకటించాయి.
ఇక ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలపై లీకులు కూడా వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15న పోలింగ్ ఉంటుందని ఈసీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎన్నికల జరిపించేందుకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఈసీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
కాగా, 2014లో మార్చి 5న షెడ్యూల్ రాగా, తెలంగాణలో ఏప్రిల్ 30న, ఏపీలో మే 7న పోలింగ్ జరిగిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ దఫా మాత్రం తొలి దశలోనే రెండు తెలుగు రాష్ట్రాల పోలింగ్ ఉండవచ్చని సమాచారం.