weather: తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాల సందడి
- ఉపరితల ఆవర్తనం, క్యుములోనింబస్ మేఘాల ఫలితం
- కొన్ని రోజులుగా కోస్తాలో వర్షాల జోరు
- రేపటి నుంచి తెలంగాణలోనూ కురిసే అవకాశం
సాధారణంగా రధసప్తమి అనంతరం ఎండలు మండిపోతాయని జనం భయపడుతుంటారు. అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బందులు తప్పవనుకుంటారు. కానీ ఈ ఏడాది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భిన్నమైన వాతావరణం నెలకొంది. అకాల వర్షాలు పలకరిస్తున్నాయి. ఒకటి రెండు భారీ వర్షాలు ఇప్పటికే కురవగా శనివారం, ఆదివారం కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ, హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు.
కోస్తా ప్రాంతాల్లో మధ్యాహ్నం వరకు ఎండ, ఉక్కపోత ఉంటున్నాయి. అదే సమయంలో సముద్రంపై నుంచి తేమ గాలులు వీస్తుండడంతో సాయంత్రం అయ్యేసరికి పలు ప్రాంతాల్లో క్యుములో నింబస్ మేఘాలు ఆవరించి ఉరుములు, పిడుగులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. గడచిన వారం రోజుల వ్యవధిలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో రెండు మూడు రోజులపాటు భారీ వర్షాలు కురవడం గమనార్హం.
విశాఖ పరిసరాల్లో గడచిన ఐదు రోజుల నుంచి ఎక్కడో ఒకచోట వర్షం కురుస్తూనే ఉంది. శుక్రవారం కూడా విశాఖ, విజయనగరం జిల్లాల్లో పలుచోట్ల 3 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలియజేస్తోంది. వాయవ్య బంగాళాఖాతం నుంచి దక్షిణ ఒడిశా తీరం, కోస్తాంధ్ర, రాయలసీమ, తమిళనాడు మీదుగా బలమైన ద్రోణి కొనసాగుతుండడంతో దాని ప్రభావం ఉంటుంది.
రాయలసీమ, కోస్తాలోని మిగిలిన ప్రాంతాల్లో ఎండతీవ్రత ఉంది. శుక్రవారం తిరుపతిలో 40.2 డిగ్రీలు, అనంతపురంలో 39.5 డిగ్రీలు, కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు ఉత్తర కర్ణాటక పరిసర ప్రాంతల్లో 900 మీటర్ల ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని, బంగాళాఖాతం వాయవ్య ప్రాంతం నుంచి తమిళనాడు మీదుగా రాయలసీమ వరకు ద్రోణి ఏర్పడి ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
ఈ కారణంగా శనివారం తెలంగాణలో పొడివాతావరణం ఉన్నప్పటికీ ఆదివారం వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. శుక్రవారం పగలు భద్రాచలంలో అత్యధికంగా 37.2, నిజామాబాద్లో 36.9, ఖమ్మం, నల్గొండలో 36.8, హైదరాబాద్లో 34.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాత్రిపూట కొన్ని ప్రాంతాల్లో చలి ఉంటోంది. శుక్రవారం తెల్లవారు జామున ఆదిలాబాద్లో 14, మెదక్లో 17, హైదరాబాద్లో 21 డిగ్రీలు నమోదయ్యాయి.