USA: అమెరికాలో విచిత్రం: మేయర్ గా ఎన్నికైన మేక.. సభ్యులుగా 15 ఇతర జంతువులు!
- అగ్రరాజ్యంలోని ఫెయిర్ హెవెన్ లో ఘటన
- నిధుల సేకరణకు సరికొత్త ఆలోచన చేసిన అధికారులు
- పిల్లలకు ఓటు హక్కు విలువ తెలిసిందని వ్యాఖ్య
అమెరికాలో వింతలు, విచిత్రాలకు కొదవ ఉండదు. అక్కడ టీనేజర్లను సైతం మేయర్లుగా ఎన్నుకుంటూ ఉంటారు. తాజాగా మసాచుసెట్స్ లోని ఫెయిర్ హెవెన్ టౌన్ లో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఈ నగరానికి మేయర్ గా మూడేళ్ల వయసున్న లింకన్ అనే బుజ్జి మేక ఎన్నికయింది.
శామీ అనే కుక్కపై పోటీచేసిన లింకన్ 3 ఓట్ల తేడాతో విజయం సాధించింది. అంతేకాకుండా నగర కౌన్సిల్ కు మరో 15 జంతువులు కూడా ఎన్నికయ్యాయి. కాగా, లింకన్ ఫెయిల్ హెవెన్ కు ఏడాది కాలం పాటు మేయర్ గా వ్యవహరించనుంది.
ఈ విషయమై టౌన్ మేనేజర్ జో గంటర్ మాట్లాడుతూ.. పట్టణంలోని స్కూలు మైదానాన్ని అభివృద్ధి చేసేందుకు నిధుల కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. దీనివల్ల పిల్లలకు ఓటు హక్కు విలువ తెలిసిందని వ్యాఖ్యానించారు. కాగా, మేక మేయర్ గా ఎన్నిక కావడంపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.