Andhra Pradesh: నన్ను వదులుకోవడం టీడీపీ ఖర్మ.. జగన్ ఆదేశిస్తే గల్లా జయదేవ్ పై పోటీచేస్తా!: మోదుగుల
- కాంగ్రెస్ నేతలు నాపై పార్లమెంటులో దాడిచేశారు
- అలాంటి నేతలతో ఇప్పుడు చంద్రబాబు జతకట్టారు
- గల్లా జయదేవ్ ఆరోపణలపై స్పందించాల్సిన అవసరం లేదు
తనలాంటి మచ్చలేని నాయకుడిని, పోరాట యోధుడిని వదులుకోవడం టీడీపీ నేతల ఖర్మని మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ విభజన సమయంలో కాంగ్రెస్ నేతలు పార్లమెంటు తలుపులు మూసి తమపై దాడిచేశారని తెలిపారు. తాను పార్లమెంటులోకి కత్తి తెచ్చినట్లు కాంగ్రెస్ నేత కమల్ నాథ్ చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అలాంటి వ్యక్తులతో చంద్రబాబు ఈరోజు జతకట్టారనీ, మధ్యప్రదేశ్ సీఎంగా కమల్ నాథ్ ప్రమాణస్వీకారానికి వెళ్లారని మండిపడ్డారు. హైదరాబాద్ లో ఈరోజు వైసీపీలో చేరిన అనంతరం మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
గుంటూరులో సభల సందర్భంగా ప్లెక్సీలపై ఫొటోలు వేయకపోవడంపై పార్లమెంటు సభ్యుడు గల్లా జయదేవ్ తనను విమర్శించడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ విషయం చూసుకోవాల్సింది జిల్లా అధికారులనీ, దానితో తనకేం సంబంధం ఉందని ప్రశ్నించారు. జగన్ ఆదేశిస్తే గుంటూరు లోక్ సభ స్థానం నుంచి గల్లా జయదేవ్ పై పోటీచేస్తానని ప్రకటించారు. గల్లా జయదేవ్ చేసే ఆరోపణలు అన్నింటికి తాను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.