Hyderabad: ప్రతి రైతుకు, పేదోడికి కనీస ఆదాయం అందిస్తాం: రాహుల్ గాంధీ
- మేము అధికారంలో కొస్తే..
- ఏ పేదోడి ఆదాయం కనీస ఆదాయ పరిమితి కన్నా తక్కువ ఉండదు
- నేరుగా బ్యాంక్ అకౌంట్లలో ఆదాయం జమ చేస్తాం
తాము అధికారంలో కొస్తే ప్రతి రైతుకు కనీస ఆదాయం వచ్చేలా పెద్ద నిర్ణయం తీసుకుంటామని, ప్రతి పేదవాడికి కనీస ఆదాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. శంషాబాద్ లో ఈరోజు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, పేద వాళ్లకు నేరుగా బ్యాంక్ అకౌంట్లలో కనీస ఆదాయం జమ చేస్తామని, ఏ పేదవాడి ఆదాయం కనీస ఆదాయ పరిమితి కన్నా తక్కువ ఉండదని హామీ ఇచ్చారు.
మోదీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదని, వచ్చే ఎన్నికల్లో తాము విజయం సాధించి అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదిస్తామని, మహిళల రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఇదేనా మోదీ దేశభక్తి?
డోక్లాంలో చైనా దళాలు ముందుకొచ్చినా మోదీ పట్టించుకోరు కానీ, చైనా ప్రధానితో కలిసి ఛాయ్ తాగుతారని, ‘ఇదేనా మోదీ దేశభక్తి?’ అని ప్రశ్నించారు. తెల్లోళ్లను తరిమిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, తాము ఎవరికీ తలవంచమని రాహుల్ స్పష్టం చేశారు.