Krishna District: దేవినేని అవినాష్ ఎఫెక్ట్... గుడివాడ నియోజకవర్గంలో అసమ్మతి స్వరాలు
- అసెంబ్లీ ఎన్నికల్లో అవినాష్‌కు టికెట్‌పై గుర్రు
- ఓ వర్గం నేతలు సమావేశమై స్థానికేతరులకు సహకరించరాదని నిర్ణయం
- హాజరైన రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జి తదితరులు
కృష్ణా జిల్లాలో కీలకమైన గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలని ఓ వైపు తెలుగుదేశం పార్టీ వ్యూహం రచిస్తుంటే, మరోవైపు నియోజకవర్గంలోని స్థానిక నేతలు అసమ్మతి స్వరం వినిపిస్తూ అధిష్ఠానం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రానున్న ఎన్నికల్లో ఈ స్థానం నుంచి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు దేవినేని అవినాష్‌ను పోటీ చేయించాలని చంద్రబాబు సూత్రప్రాయంగా నిర్ణయించిన విషయం తెలిసిందే. స్థానిక నేతలతో సమావేశం అయిన అనంతరం అధికారికంగా పేరు ప్రకటించాలని ఆయన నిర్ణయించినట్టు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు చంద్రబాబు ఎక్కడ నుంచి పోటీ చేయమంటే అక్కడ నుంచి పోటీ చేస్తానని అవినాష్ కూడా ప్రకటించడంతో సీటు కేటాయింపు దాదాపుగా ఖరారైనట్లు భావిస్తున్నారు.
అయితే ఈ నిర్ణయంపై నియోజకవర్గంలోని ఓ వర్గం నేతలు భగ్గుమన్నారు. వీరంతా ప్రత్యేకంగా సమావేశమై స్థానికేతరులకు టికెట్టు కేటాయిస్తే టీడీపీకి సహకరించకూడదని నిర్ణయించారు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జిలు హాజరైన ఈ సమావేశానికి నందివాడ, గుడివాడ, గుడ్లవల్లేరు పార్టీ నేతలు హాజరై తమ అసమ్మతి స్వరం వినిపించారు.