chandrababu: ఎన్నికల్లో టీడీపీ నినాదం ఇదే: చంద్రబాబు
- 'మీ భవిష్యత్తు - మా బాధ్యత' నినాదంతో ముందుకెళదాం
- ఈ నెల రోజులు సర్వశక్తులు ఒడ్డండి
- ఎన్నికల్లో గెలుపే టీడీపీ కార్యకర్తల ధ్యేయం
రానున్న ఎన్నికల్లో 'మీ భవిష్యత్తు - మా బాధ్యత' అనే నినాదంతో ముందుకెళదామని టీడీపీ శ్రేణులకు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఎన్నికల ఎమర్జన్సీ సమయం కొనసాగుతోందని... ప్రతి ఒక్కరూ అవిశ్రాంతంగా పని చేయాలని నేతలు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ నెల రోజులు ఎవరికీ సెలవులు లేవని, ఎవరికీ మినహాయింపులు ఉండవని చెప్పారు. టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.
ఎన్నికల నగారా మోగిందని... మనం మాత్రం ఇంతకు ముందే ఎన్నికలకు సమాయత్తమయ్యామని చంద్రబాబు అన్నారు. ఎన్నికల తేదీ గడువు కచ్చితంగా 30 రోజులు మాత్రమే ఉందని... సర్వశక్తులు ఒడ్డాలని పిలుపునిచ్చారు. ఓట్ల నమోదు, తొలగింపుకు ఐదు రోజుల గడువు మాత్రమే ఉందని...ఈ ఐదు రోజులు ప్రతి రోజు ఓటును తనిఖీ చేసుకోవాలని సూచించారు. యుద్ధంలో గెలుపే జవాన్ల లక్ష్యమని... ఎన్నికల్లో గెలుపే టీడీపీ కార్యకర్తల ధ్యేయమని చెప్పారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి, అందరూ సమన్వయంతో పని చేయాలని... మెజారిటీయే లక్ష్యంగా ముందుకు సాగాలని అన్నారు.