kct: టీకాంగ్రెస్ సంచలన నిర్ణయం.. ఎమ్మెల్సీ ఎన్నికల బహిష్కరణ
- రెండో సారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరిస్తారని ఆశించాం
- తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా ఆయన వ్యవహరిస్తున్నారు
- మా బలం ప్రకారం ఒక ఎమ్మెల్సీని గెలవాల్సి ఉంది
తెలంగాణ కాంగ్రెస్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలను బహిష్కరిస్తున్నామని ప్రకటించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు జరగనున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఓ వైపు తమ ఎమ్మెల్యేలకు టీఆర్ఎస్ మాక్ పోలింగ్ ను నిర్వహిస్తోంది. ఈ తరుణంలో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా గాంధీ భవన్ లో మీడియాతో ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, రెండోసారి అధికారంలోకి వచ్చాకైనా ముఖ్యమంత్రి కేసీఆర్ రాజనీతిజ్ఞుడిగా వ్యవహరిస్తారని ఆశించామని... కానీ తెలంగాణ ప్రజలు సిగ్గుపడేలా వికార, వికృత చేష్టలకు ఆయన పాల్పడ్డారని మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి... పార్టీ ఫిరాయింపులను నేరుగా ఆయనే ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. తమకున్న బలం ప్రకారం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక సీటును గెలవాల్సి ఉందని... కానీ, కేసీఆర్ తీరుతో ప్రజాస్వామ్యం మరోసారి అపహాస్యంపాలయిందని అన్నారు. కేసీఆర్ తీరును నిరసిస్తూ ఎమ్మెల్సీ ఎన్నికలను తాము బహిష్కరిస్తున్నామని చెప్పారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ కు తాము సహకరించామని... కానీ, కేసీఆర్ తీరు మాత్రం మారలేదని అన్నారు.