Rahul Gandhi: పంజాబ్ లో డ్రగ్స్ భూతాన్ని రాహుల్ గాంధీకి కళ్లకు కట్టినట్టు చూపించిన ఎమ్మెల్యే
- ఫేస్ బుక్ లైవ్ లో డ్రగ్స్ కొనుగోలుచేసిన శాసనసభ్యుడు
- నేరుగా వెళ్లి పోలీస్ కమిషనర్ తో భేటీ
- పోలీసులు, స్మగ్లర్లు కుమ్మక్కయ్యారంటూ ఆరోపణ
సరిగ్గా నాలుగు రోజుల క్రితం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ పంజాబ్ కు సంబంధించి ఓ కీలక వ్యాఖ్య చేశారు. పంజాబ్ ప్రభుత్వం డ్రగ్స్ మాఫియాను తుడిచిపెట్టేసిందని అన్నారు. కానీ, రాహుల్ వ్యాఖ్యలు మాటల వరకే పరిమితం అని లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యే సిమ్రాన్ జిత్ సింగ్ బైన్స్ నిరూపించాడు.
లూథియానాకు చెందిన ఈ యువ శాసనసభ్యుడు ఉదయాన్నే చీమా చౌక్ లో హెరాయిన్ పొడి కొనుగోలు చేస్తూ ఆ వ్యవహారాన్ని తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా లైవ్ లో చూపించారు. లూథియానాలో మాదకద్రవ్యాలు కూరగాయలు దొరికినట్టు ఎక్కడి పడితే అక్కడ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని స్పష్టం చేశారు. లూథియానా పోలీసులు, స్మగ్లర్లతో లాలూచీ పడి చూసీచూడనట్టు వదిలేస్తున్నారని బైన్స్ ఆరోపించాడు.
చీమా చౌక్ లో డ్రగ్స్ కొనుగోలు చేసిన అనంతరం బైన్స్ నేరుగా లూథియానా పోలీస్ కమిషనర్ సుక్చయిన్ సంగ్ గిల్ కార్యాలయానికి వెళ్లారు. లూథియానా వీధుల్లో మాదకద్రవ్యాల అమ్మకం యథేచ్ఛగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడంలేదని అసహనం వ్యక్తం చేశారు బైన్స్. డ్రగ్స్ భూతాన్ని పారదోలామని చెప్పుకుంటున్న కాంగ్రెస్ సర్కారుకు నిజంగా ఇది చెంపపెట్టు లాంటి ఘటన అని చెప్పాలి.