jagan: ఈ తొమ్మిదేళ్లు ఎన్నో కష్టాలను అనుభవించాం: జగన్
- మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారు
- డేటా చోరీపై ప్రజల్లో చర్చ జరగాలి
- అందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే రాజన్న రాజ్యం రావాలి
వైసీపీని స్థాపించి రేపటికి తొమ్మిదేళ్లు అవుతుందని వైసీపీ అధినేత జగన్ అన్నారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో ఎన్నో కష్టాలను అనుభవించామని చెప్పారు. కాకినాడ శంఖారావం సభలో ఆయన ప్రసంగిస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు. నాలుగేళ్లు బీజేపీతో జతకట్టి రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని అన్నారు. మోసాలు చేయడంలో చంద్రబాబు పీహెచ్డీ చేశారని చెప్పారు. సంక్షేమ పథకాలు అందరికీ అందాలంటే రాజన్న రాజ్యం రావాలని అన్నారు. ఇంటెలిజెన్స్ పోలీసులను సెక్యూరిటీ గార్డుల్లాగా ఉపయోగించుకుంటున్నారని తెలిపారు.
ఎన్నికలు రాగానే చంద్రబాబుకు ప్రజలు గుర్తుకు వచ్చారని జగన్ విమర్శించారు. చంద్రబాబు చేసిన మోసాలపై ప్రతి ఇంట్లో చర్చ జరగాలని అన్నారు. చివరకు దేవుడి భూములను కూడా వదలడం లేదని దుయ్యబట్టారు. టెండర్లన్నీ చంద్రబాబు బినామీలకే దక్కుతున్నాయని అన్నారు. ఈవీఎం హ్యాకింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి చంద్రబాబుకు సలహాదారు అని ఎద్దేవా చేశారు. డేటా చోరీ అంశంపై ప్రజల్లో చర్చ జరగాలని తెలిపారు. ఎన్నికల ముందు టీడీపీ ఏం చెప్పింది? ఎన్నికల తర్వాత ఏం చేసింది? అనే అంశంపై అందరూ చర్చించాలని అన్నారు. అమరావతిలో టెంపరరీ భవనాలు తప్ప, ఒక్క పర్మినెంట్ భవనం కూడా లేదని విమర్శించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని అన్నారు. చంద్రబాబు పార్టీలా జగన్ పార్టీ ఉండదని చెప్పారు.