Chandrababu: చెడు చేయాలని చూసినా మంచే జరిగింది... దేశమంతా తిరిగొస్తా: చంద్రబాబు
- ఎండలు పెరిగేలోగా ఎన్నికలు పూర్తవుతాయి
- ఈ 28 రోజులూ ఎవరూ విశ్రాంతి తీసుకోవద్దు
- ఏపీకి ఫస్ట్ ఫేజ్ లో ఎన్నికలపై చంద్రబాబు స్పందన
లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ లో భాగంగా ఏపీకి తొలి దశలోనే ఎన్నికలు నిర్వహించడం ద్వారా మనకు చెడు చేయాలని భావించారని, అయితే, తనకు మాత్రం ఆనందంగానే ఉందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు వ్యాఖ్యానించారు. ఇది రాష్ట్రానికి ముఖ్యంగా తనకు ఓ మంచి అవకాశమని, ఎండలు పెరగకముందే ఎన్నికలు అయిపోతాయని, ఆపై ఎంతో స్వేచ్ఛగా ఉండవచ్చని, దేశమంతా తిరిగి ఎన్నికల ప్రచారం చేసుకోవచ్చని అన్నారు.
తిరుమల వెంకటేశ్వరుని ఆశీర్వాదం తనపై ఎల్లప్పుడూ ఉంటుందని, 24 క్లెమోర్ మైన్స్ తో దాడి చేసినా తన ప్రాణాలను ఆయన కాపాడాడని అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెడు చేయాలనే ఉద్దేశంతో లాస్ట్ ఫేజ్ లో జరగాల్సిన ఎన్నికలను ఫస్ట్ ఫేజ్ కు తెచ్చారని ఆరోపించారు. ఎన్నికలకు మరో 28 రోజుల గడువు మాత్రమే ఉందని గుర్తు చేసిన ఆయన.. నేతలు, కార్యకర్తలకు ఎవరికీ విశ్రాంతి లేదని, ఎవరినీ మినహాయించేది లేదని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ పార్టీ విజయానికి శ్రమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలు ఎంతో తెలివైనవారని, విభజన సమయంలో ఉన్న పరిస్థితులు, ఇప్పుడున్న పరిస్థితులను బేరీజు వేసుకుని తీర్పివ్వనున్నారని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.