Hyderabad: హైదరాబాద్ లో ఒక్కసారిగా పెరిగిన ఎండ!
- కొనసాగుతున్న ఉపరితల ద్రోణి
- తెలంగాణలో సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రత
- మరో నాలుగు రోజులు ఇంతేనన్న వాతావరణ శాఖ
దక్షిణ మధ్య కర్ణాటక నుంచి విదర్భ వరకు, ఉత్తర మధ్య కర్ణాటక, మరట్వాడా మీదుగా దాదాపు కిలోమీటర్ ఎత్తున ఉపరితల ద్రోణి కొనసాగుతుండటంతో హైదరాబాద్ సహా, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగాయి. గత రెండు రోజులుగా సాధారణం కన్నా 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉన్న ఉష్ణోగ్రత, మంగళవారం నాడు 38 డిగ్రీలకు చేరింది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గాలిలో తేమ శాతం తగ్గిపోతుండగా, నగర వాసులు ఉక్కపోతను అనుభవిస్తున్నారు. సోమవారం గరిష్ఠంగా 37.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని, ప్రజలు అత్యవసరమైతేనే ఇల్లు దాటి బయటకు రావాలని అధికారులు హెచ్చరించారు. మరో మూడు నాలుగు రోజుల పాటు సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అంచనా వేశారు.