Gujarath: గుజరాత్ లో 5,000 ఏళ్ల నాటి అస్థిపంజరం లభ్యం
- ఆరడుగుల పొడవుతో చెక్కుచెదరని వైనం
- హరప్పా నాగరికతపై మరింత సమాచారం తెలిసే అవకాశం
- దీర్ఘచతురస్రాకారంలో సామూహిక సమాధుల గుర్తింపు
గుజరాత్ లోని కచ్ ప్రాంతంలో పురావస్తు శాస్త్రజ్ఞులు 5,000 ఏళ్ల నాటి మానవ అస్థిపంజరాన్ని కనుగొన్నారు. దాదాపు రెండు నెలలుగా కచ్ లోని ధోలావిరా ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్న పరిశోధకులకు ఒకే చోట పెద్ద సంఖ్యలో సమాధులు కనిపించాయి. ఈ సమాధులు దీర్ఘచతురస్రాకారంలో ఉండి ఒక్కో దాంట్లో సుమారు 20 దేహాలను ఖననం చేసేందుకు వీలుగా ఉన్నాయి. ఇది హరప్పా నాగరికత కాలానికి సంబంధించిన శ్మశాన వాటిక అయ్యుంటుందని పురావస్తు నిపుణులు భావిస్తున్నారు.
ఇందులో చాలా అస్థిపంజరాలు చెల్లాచెదురైన స్థితిలో కనిపించగా, ఒకటి మాత్రం ఆరడుగుల పొడవుతో చెక్కుచెదరకుండా ఉంది. అక్కడ లభించిన ఇతర వస్తువుల ఆధారంగా ఆ సమాధులు నిర్మించిన కాలాన్ని 4,600 నుంచి 5,200 ఏళ్ల మధ్యలో ఉండొచ్చని అంచనా వేశారు. అక్కడ లభించిన అస్థిపంజరాన్ని కేరళ యూనివర్శిటీకి తరలించి దాని వయసు, లింగ నిర్ధారణ, చనిపోవడానికి కారణం వంటి ఇతర అంశాలను తెలుసుకుంటామని ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన సురేష్ భండారీ తెలిపారు.