Andhra Pradesh: కేసీఆర్ వార్నింగ్ తో పోటీ నుంచి తప్పుకున్నారన్న వార్తలపై క్లారిటీ ఇచ్చిన మురళీమోహన్!
- కేసీఆర్ బెదిరిస్తున్నారన్నది నిజం కాదు
- ట్రస్ట్ కోసమే పోటీ నుంచి తప్పుకుంటున్నా
- నా కోడలిని రాజమండ్రి ఎంపీగా పోటీకి దించాలని భావిస్తున్నాం
సినిమా వాళ్లను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భయపెడుతున్నారన్నది నిజం కాదని టీడీపీ నేత మురళీమోహన్ తెలిపారు. ఒకరు భయపెడితే సినిమావాళ్లు భయపడరని వ్యాఖ్యానించారు. బెదిరించడం వల్లే తాను పోటీ నుంచి తప్పుకున్నానని వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేశారు. రాజమండ్రిలో ఈరోజు టీడీపీ తరఫున మురళీ మోహన్ ప్రచారం నిర్వహించారు.
తన ట్రస్టు కార్యకలాపాలు చూసుకోవడానికే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు మురళీమోహన్ తేల్చిచెప్పారు. తాను అప్పట్లో వైఎస్ రాజశేఖరరెడ్డికే ఎదురుతిరిగి నిలబడ్డాననీ, 18 ఎకరాల భూమి పోయినా లెక్కచేయలేదని గుర్తుచేశారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేస్తానని ప్రకటించారు.
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తన కోడలు మాగంటి రూపను టీడీపీ తరఫున బరిలోకి దించే విషయమై ఆలోచిస్తున్నట్లు మురళీ మోహన్ తెలిపారు. ఈ విషయమై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుతో చర్చిస్తామని పేర్కొన్నారు.