Pawan Kalyan: నావల్ల నా అన్నకు సుఖం లేదు, నన్ను కట్టుకున్న వాళ్లకు సుఖంలేదు: పవన్ భావోద్వేగం
- జగన్, చంద్రబాబుతో విభేదాల్లేవు
- నన్నేమీ అనలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు
- వేలకోట్లు ఆస్తులు దోచానా! కులాల పేరుతో రాజకీయాలు చేశానా!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజమండ్రిలో జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో తన సహజశైలిలో ఆవేశపూరితంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను రాజకీయాల్లోకి వచ్చింది స్వప్రయోజనాల కోసం కాదని, ఏదో సంపాదించుకుందామన్న ఉద్దేశం లేనేలేదని స్పష్టం చేశారు. సినిమాలు లేకపోయినా ఏ అభిమానిని అడిగినా పట్టెడన్నం పెడతారని చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
తనకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు అర్థంకాలేదని, జగన్, చంద్రబాబు ఎందుకు విరోధులయ్యారో తెలియడంలేదని అన్నారు. తనను ఏమీ అనలేక వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయినా తానేమైనా వేలకోట్లు దోచానా? అంటూ జగన్ కు, కులాల పేరుతో రాజకీయాలు చేశానా? అంటూ చంద్రబాబుకు చురకలు అంటించారు.
తనకు జగన్ అన్నా, చంద్రబాబు అన్నా వ్యక్తిగత వైరం ఏమీలేదని స్పష్టం చేశారు. కానీ, తాను అన్నం తింటున్నప్పుడు ఎవరైనా కనిపిస్తే వాళ్ల తిండి గురించి ఆలోచిస్తానని, తాను భద్రత వలయంలో ఉన్నప్పుడు ఓ జూనియర్ ఆర్టిస్ట్ కనిపిస్తే ఆ ఆమ్మాయి క్షేమంగా ఇంటికి చేరుకోవాలని కోరుకుంటాను అంటూ ప్రసంగించారు. తనకు ఎన్ని ఆస్తులు ఉన్నా సుఖం లేదని, తన కుటుంబ సభ్యులకు, బంధుమిత్రులకు కూడా తన వల్ల సుఖం లేదని అన్నారు. తన అన్నకు కూడా తన వల్ల సుఖం లేదని, తనను కట్టుకున్నవాళ్లకు, తన బిడ్డలకు సుఖం లేదని చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్.