Amalapuram: అమలాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా హర్షకుమార్.. దాదాపు ఖరారు
- అమలాపురం లోక్‌సభ సీటుపై టీడీపీ తర్జన భర్జన
- బాలయోగి కుమారుడికి అసెంబ్లీ
- హర్షకుమార్కు ఎంపీ స్థానం కేటాయించాలని నిర్ణయం
అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చిన తెలుగుదేశం పార్టీ గురువారం రాత్రి 126 మందితో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. నేడో, రేపో మరో జాబితాను విడుదల చేయనుంది. అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తికావచ్చిన నేపథ్యంలో ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురం లోక్‌సభ సీటు విషయంలో టీడీపీ అధిష్ఠానం ఆచితూచి వ్యవహరిస్తోంది.
గతంలో ఈ స్థానం నుంచి టీడీపీ తరపున విజయం సాధించిన పండుల రవీంద్రబాబు ఈసారి టికెట్ దక్కే అవకాశం లేకపోవడంతో పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో దివంగత లోక్‌సభ స్పీకర్ జీఎంసీ బాలయోగి కుమారుడు హరీష్ మాధుర్ పేరును అధిష్ఠానం పరిశీలించినప్పటికీ అతనికి అమలాపురం అసెంబ్లీ స్థానాన్ని ఖరారు చేసింది. దీంతో ఈ స్థానం నుంచి మాజీ ఎంపీ హర్షకుమార్‌ను రంగంలోకి దింపాలని పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ మేరకు పార్టీ నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేపాటు నియోజకవర్గాల్లో నేతల నుంచి అభిప్రాయాలు సేకరించిన అధిష్ఠానం హర్షకుమార్వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో హర్షకుమార్‌తో పార్టీ నేతలు ఇప్పటికే చర్చించినట్టు సమాచారం. మరోవైపు హర్షకుమార్ మాట్లాడుతూ.. తాను చంద్రబాబు పిలుపు కోసమే ఎదురుచూస్తున్నానని, అమలాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు.