Nara Lokesh: మూడు దశాబ్దాలుగా తెలుగుదేశంకు ప్రాతినిధ్యం లేని మంగళగిరి నియోజకవర్గం... బరిలోకి దిగిన లోకేశ్!
- కొన్నిసార్లు మిత్రపక్షాలకు స్థానం
- పోటీ చేసిన వేళ టీడీపీకి ఓటమి
- లోకేశ్ గెలుస్తారంటున్న పార్టీ వర్గాలు
తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు 1982లో స్థాపించగా, అప్పటి నుంచి మంగళగిరిలో ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం అభ్యర్థి గెలువగా, ఆపై మూడు దశాబ్దాల్లో ఒక్కసారి కూడా ఆ పార్టీ అభ్యర్థి గెలవలేదు. 1985లో తెలుగుదేశం అభ్యర్థి ఎంఎస్ఎస్ కోటేశ్వరరావు, తన సమీప కాంగ్రెస్ అభ్యర్థి జమునపై దాదాపు 5 వేల ఓట్ల ఆధిక్యంలో గెలుపొందగా, ఆపై టీడీపీ అక్కడ విజయం సాధించలేదు.
ఆపై మంగళగిరి స్థానాన్ని తెలుగుదేశం తనకు మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలకే కేటాయిస్తూ వచ్చింది. 1994 మినహా అన్ని ఎన్నికల్లో మంగళగిరిని కాంగ్రెస్ గెలుచుకోగా, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. 2009 ఎన్నికల్లో అక్కడ ప్రజారాజ్యం పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అంటే ఇప్పటివరకూ తెలుగుదేశం పార్టీ తరఫున మంగళగిరి నుంచి గడచిన 30 ఏళ్లలో ఎమ్మెల్యేనే లేడు. అటువంటిది ఇప్పుడు టీడీపీ యువనేత నారా లోకేశ్, తాను తొలిసారిగా పోటీ పడేవేళ, అదే మంగళగిరి స్థానాన్ని ఎంచుకుని పెద్ద సాహసాన్నే చేశారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
అయితే, మారిన పరిస్థితులు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ వేరుపడిన తరువాత, మంగళగిరి నియోజకవర్గంలోని అత్యధిక విస్తీర్ణం, రాజధాని అమరావతి పరిధిలోకి వెళ్లడం తెలుగుదేశం పార్టీకి లాభిస్తుందని అంచనా. ఈ నియోజకవర్గంలో 3 లక్షలకు మందికిపైగా ఓటర్లు ఉండగా, అందులో లక్షకు పైగా బీసీల ఓట్లు ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం వరకూ వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న ఈ నియోజకవర్గం, ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఆధారంగా నడుస్తోంది.
రాజధానికి దాదాపు 40 వేల ఎకరాల భూమిని తీసుకోవడం, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పడటంతో ఈ ప్రాంత ప్రజల్లో సానుకూల ధోరణి కనిపిస్తోందని, అదే తమకు ఓట్ల రూపంలో కనిపిస్తుందని తెలుగుదేశం వర్గాలు భావిస్తున్నా, స్థానిక సమీకరణాలు కాస్తంత అడ్డుగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇక్కడి కొన్ని బీసీ సంఘాలు లోకేశ్ పట్ల తమ వ్యతిరేకతను చూపిస్తున్నాయి. పద్మశాలీలకు సీటివ్వాలని ఓ వర్గం, ఎవరైనా బీసీనే నిలబెట్టాలని మరో వర్గం డిమాండ్ చేస్తున్న పరిస్థితి.
కొన్ని సానుకూలతలు, మరికొన్ని ప్రతికూలతలూ ఉన్న మంగళగిరి నియోజకవర్గంలో లోకేశ్ గెలుపు అంత సులువు కాదుకానీ, ఆయన గెలుస్తారన్న నమ్మకం ఉందని తెలుగుదేశం పార్టీ వర్గాలు అంటున్నాయి.