new zealand: న్యూజిలాండ్ లో రక్తపాతం.. ఎవరూ మసీదులకు వెళ్లొద్దని పోలీసుల హెచ్చరిక
- న్యూజిలాండ్ లో రెండు మసీదులపై దుండగుల కాల్పులు
- పోలీసుల అదుపులో ఒక మహిళ, ముగ్గురు పురుషులు
- అప్రమత్తంగా ఉండాలంటున్న క్రైస్ట్ చర్చ్ పోలీస్ కమిషనర్
న్యూజిలాండ్ లోని క్రైస్ట చర్చ్ నగరంలోని రెండు మసీదుల్లో ఆగంతుకులు కాల్పులకు తెగబడిన సంగతి తెలిసిందే. ఈ కాల్పుల నుంచి బంగ్లాదేశ్ క్రికెట్ ఆటగాళ్లు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. ఎంతో ప్రశాంతంగా ఉండే న్యూజిలాండ్ లో ఈ కాల్పులు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో, తమ పౌరులకు న్యూజిలాండ్ పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా క్రైస్ట్ చర్చ్ లోని అన్ని పాఠశాలలను మూసివేయించారు. ప్రార్థనల కోసం ముస్లింలు ఎవరూ మసీదుల్లోకి వెళ్లవద్దని సూచించారు. నగరంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే... వారిని వెంటనే అదుపులోకి తీసుకోవాలని పోలీస్ కమిషనర్ మికీ బుష్ ఆదేశాలు జారీ చేశారు.
మరోవైవు, కాల్పుల అనంతరం నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒక మహిళ, ముగ్గురు పురుషులు ఉన్నారు. ప్రస్తుతం వారిని విచారిస్తున్నారు. ఈ సందర్భంగా బుష్ మాట్లాడుతూ, అన్ని కోణాల్లో తాము చర్యలు చేపట్టామని... ప్రమాదం ముగిసి పోయిందని ఎవరూ భావించవద్దని... అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.