YS Viveka: వివేకా మరణం వెనుక కుట్ర ఉందా?: పోలీసులు విచారించాలని విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
- రక్తపు మడుగులు దిగ్భ్రాంతికి గురి చేశాయి
- లోతైన దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేస్తున్నా
- హైదరాబాద్ లో విజయసాయిరెడ్డి
వైఎస్ రాజశేఖరరెడ్డి సోదరుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతి వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా? అన్న విషయంలో నిష్పాక్షికంగా దర్యాఫ్తును సాగించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, తమకెంతో ముఖ్యుడైన వివేకా మృతి చెందిన ప్రాంతంలో రక్తపు మడుగులు కనిపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబ సభ్యులమంతా దీనిపై లోతైన దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
వైఎస్ జగన్ పులివెందులకు వెళుతున్నారని, వివేకా అంత్యక్రియలు ముగిసేంత వరకూ అక్కడే ఉంటారని అన్నారు. తనకు అందిన సమాచారం ప్రకారం, వివేకా మృతి అనుమానాస్పదంగా కనిపిస్తోందని, అందువల్లే దర్యాఫ్తును కోరుతున్నామని తెలిపారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా? లేక దీనివెనుక ఎవరైనా ఉన్నారా? అన్న విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాతే తేలుతుందని, దానికోసమే వేచిచూస్తున్నామని చెప్పారు. వివేకా మృతిచెందిన వేళ, రాజకీయాలు వద్దని, నేడు లేదా రేపు ఆయన అంత్యక్రియలు జరుగుతాయని, దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.