Hyderabad: సాఫ్ట్వేర్ ఉద్యోగులకు శుభవార్త.. వచ్చే వారం నుంచే అమీర్‌పేట-హైటెక్ సిటీ మార్గంలో మెట్రో కూత
- రైళ్లు నడిపేందుకు సీఎంఆర్ఎస్ అనుమతి
- ఇప్పటికే పూర్తయిన ట్రయల్ రన్
- వేలాదిమందికి ప్రయోజనం
హైటెక్ సిటీ ప్రాంతంలో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులకు హైదరాబాద్ మెట్రో శుభవార్త చెప్పింది. అమీర్‌పేట-హైటెక్‌సిటీ మధ్య వచ్చేవారం నుంచి మెట్రో రైలు కూత పెట్టనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఈ కారిడార్‌లో పనులు గత నవంబరు నాటికే పూర్తి కాగా, తాజాగా రైళ్లు నడిపేందుకు కమిషనర్ ఆఫ్ మెట్రో రైల్ సేఫ్టీ (సీఎంఆర్ఎస్) అనుమతి ఇచ్చింది. గత కొన్ని రోజులుగా ఈ మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎటువంటి హడావుడి, ప్రచార ఆర్భాటం లేకుండా రైలు సేవలను ప్రారంభించాలని మెట్రో అధికారులు నిర్ణయించారు. మాదాపూర్, హైటెక్ సిటీ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో లెక్కకుమించి ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీల్లో వేలాదిమంది పనిచేస్తున్నారు. ఇప్పుడీ మెట్రోరైలు మార్గం అందుబాటులోకి రావడంతో వారందరికీ ఎంతో ప్రయోజనం చేకూరనుంది.
ముఖ్యంగా ఈ ప్రాంతంలో నిత్యం ఎదురయ్యే ట్రాఫిక్ ఇబ్బందుల నుంచి బయటపడి త్వరగా కార్యాలయాలకు చేరుకునే అవకాశం లభిస్తుంది. అమీర్‌పేట-హైటెక్ సిటీ స్టేషన్ల మధ్య మధురానగర్, యూసఫ్‌గూడ, జూబ్లీహిల్స్‌రోడ్ నంబర్-5, జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, పెద్దమ్మగుడి, మాదాపూర్, దుర్గంచెరువు, హైటెక్‌సిటీ స్టేషన్లుంటాయి.