Jagan: వివేకాను రెండు సార్లు కొట్టిన వైఎస్ జగన్: మాజీ ఎంపీ హర్షకుమార్
- 2006లో ఘటన.. ఎంపీ పదవిని వదిలేయాలని జగన్ డిమాండ్
- సోనియా ఆగ్రహిస్తే క్షమాపణ చెప్పిన వైఎస్
- అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వైఎస్ జగన్, తన బాబాయ్ వివేకానందరెడ్డిపై రెండు సార్లు చేయి చేసుకున్నారని, ఈ సంగతి తనతో పాటు ఆ సమయంలో ఉన్న ఎంపీలందరికీ తెలుసునని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు. వివేకా మరణం తరువాత సానుభూతి కోసం జగన్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించిన ఆయన, గతంలో వైఎస్ మరణించిన సమయంలోనూ జగన్ ఇదే పని చేశారని మండిపడ్డారు.
2006లో వైఎస్ వివేకానందరెడ్డి రాజీనామా సమయంలో జగన్, ఆయన్ను కొట్టారని అన్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంట్ లో ఉన్న వేళ, రాజంపేట ఎంపీ సాయిప్రకాప్ కు ఫోన్ వచ్చిందని, ఆ వెంటనే వివేకా రాజీనామా చేసి విమానాశ్రయానికి వెళుతున్నారని, సోనియా ఆదేశాల మేరకు ఆయన్ను తీసుకు వచ్చేందుకు వెళుతున్నానని ఆయన అన్నారని గుర్తు చేసుకున్నారు. సోనియా పిలిపించి, కారణం అడిగితే, అప్పటికే తన తండ్రి సీటు తనకు కావాలని అడుగుతూ, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, జగన్ రెండుసార్లు కొట్టాడని వివేకాయే స్వయంగా చెప్పాడని అన్నారు.
దీంతో ఆగ్రహానికి గురైన సోనియా, వైఎస్ కు ఫోన్ చేసి, కుమారుడిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించగా, ఆయన క్షమాపణలు చెప్పారని, ఆ తరువాతనే 2009లో జగన్ ఎంపీ అయ్యారని ఈ విషయాలన్నీ నాడున్న ఎంపీలకు తెలుసునని అన్నారు. ఇదే విషయాన్ని తన ఫేస్ బుక్ ఖాతాలో హర్షకుమార్ పోస్ట్ చేశారు.