newzeland: 9 నిమిషాల ముందే ఉగ్రదాడిపై సమాచారం అందింది.. కానీ కాపాడలేకపోయాం!: న్యూజిలాండ్ ప్రధాని జసిండా ఆవేదన
- దాడి విషయాన్ని మాకు మెయిల్ చేశాడు
- కానీ క్లారిటీ లేక కాపాడలేకపోయాం
- దాడుల్లో ఐదుగురు భారతీయుల దుర్మరణం
న్యూజిలాండ్ లోని క్రైస్ట్ చర్చ్ నగరంలో ఉన్న రెండు మసీదుల్లో ప్రార్థనలు చేసుకుంటున్న వారిపై ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో 49 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోగా, పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. ఈ విషయమై న్యూజిలాండ్ ప్రధాని జసిండా అర్డెర్న్ సంచలన విషయం బయటపెట్టారు. ఈ దారుణానికి తెగబడ్డ బ్రెంటన్ టర్రంట్ తాను దాడిచేయబోతున్నట్లు ముందుగానే ప్రధాని కార్యాలయానికి ఈ-మెయిల్ పెట్టాడని తెలిపారు.
తాను ఎందుకు దాడి చేస్తున్నాడు? దాని లక్ష్యాలు ఏంటి? వంటి అంశాలతో కూడిన మేనిఫెస్టోను దాడికి కేవలం 9 నిమిషాల ముందు పంపాడని వెల్లడించారు. కేవలం ప్రధాని కార్యాలయానికే కాకుండా మరో 30 మందికి ఇలా బ్రెంటన్ సమాచారాన్ని పంపాడన్నారు. ఈ-మెయిల్ అందుకున్న 2 నిమిషాల్లోనే భద్రతాసిబ్బంది, ఇంటెలిజెన్స్ వర్గాలు అప్రమత్తమయ్యామని పేర్కొన్నారు.
అయితే ఎక్కడ, ఏ సమయంలో దాడిచేయబోతున్నాడన్న విషయంలో స్పష్టత లేకపోవడంతో అమాయకులు ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, ఈ అఘాయిత్యాన్ని ఫేస్ బుక్ లో ప్రత్యక్షప్రసారం చేయడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంలో వివరణ ఇవ్వాలని ఫేస్ బుక్ యాజమాన్యాన్ని ఆదేశించారు. మరోవైపు ఈ దుర్ఘటనలో చనిపోయినవారిలో ఐదుగురు భారతీయులు ఉన్నట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది.