Pawan Kalyan: లక్ష్మీనారాయణ పోటీ చేసే స్థానంపై సాయంత్రానికి తేల్చేయనున్న పవన్ కల్యాణ్
- నంద్యాల/కర్నూలు బరిలో దిగాలన్న జనసేనాని
- వైజాగ్, కాకినాడ వైపు మొగ్గుచూపుతున్న సీబీఐ మాజీ జేడీ
- మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం
సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా పనిచేసిన కాలంలో ఎన్నో కీలక కేసుల్లో దర్యాప్తు చేసిన తెలుగుతేజం లక్ష్మీనారాయణ జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆయన రాజకీయ రంగప్రవేశం గురించి కొన్నాళ్లుగా మీడియాలో ఊహాగానాలు వస్తున్నాయి. టీడీపీలో చేరతారంటూ విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే, అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ పవన్ కల్యాణ్ ఆహ్వానం మేరకు జనసేన పార్టీలో చేరారు. ఆదివారం పవన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు.
అయితే, పార్టీలో లక్ష్మీనారాయణ స్థానం ఏంటి? ఎన్నికల్లో ఆయన ఎక్కడినుంచి పోటీచేస్తారన్న విషయంలో స్పష్టత లేదు. ఎన్నికలకు కూడా అట్టే సమయం లేకపోవడంతో పవన్ కల్యాణ్ ఈ విషయంపై వెంటనే దృష్టిపెట్టారు. మొదట లక్ష్మీనారాయణను రాయలసీమ నుంచి పోటీచేయాలని కోరినట్టు సమాచారం. కర్నూలు, నంద్యాల లోక్ సభ స్థానాలను పరిశీలించాలంటూ పవన్ సీబీఐ మాజీ జేడీకి సూచించగా, ఆయన విశాఖ, కాకినాడ పార్లమెంటు స్థానాల్లో ఒకదాన్ని కేటాయించాలంటూ జనసేనానికి విజ్ఞప్తి చేసినట్టుగా తెలుస్తోంది. దీనిపై లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఆదివారం సాయంత్రానికి తానెక్కడి నుంచి పోటీచేయాలనేది పవన్ ప్రకటిస్తారని తెలిపారు.