Andhra Pradesh: ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’.. నర్సీపట్నంలో ‘యాత్ర’ సినిమా డైలాగ్ కొట్టిన జగన్!
- వైసీపీ అధికారంలోకి వస్తే సుపరిపాలన అందిస్తాం
- పాదయాత్రలో ప్రజల కష్టాలను కళ్లారా చూశాను
- పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలుచేస్తాం
వైసీపీ అధికారంలోకి వస్తే అవినీతిలేని సుపరిపాలన అందిస్తామని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. కులమతాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలుచేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలను, ఇబ్బందులను ప్రజాసంకల్పయాత్ర ద్వారా తెలుసుకున్నానని వ్యాఖ్యానించారు. విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం బస్టాండ్ లో ఈరోజు ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా జగన్ స్పందిస్తూ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలిరోజే జన్మభూమి కమిటీలను రద్దుచేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ ‘నేను విన్నాను-నేను ఉన్నాను’ అని ‘యాత్ర’ సినిమా డైలాగ్ చెప్పడంతో ఈ ప్రాంతం హర్షధ్వానాలతో మార్మోగింది. నర్సీపట్నం ఎమ్మెల్యే అభ్యర్థి ఉమశంకర్ గణేష్, అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సత్యవతిని గెలిపించాలని జగన్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
‘పాదయాత్రలో 3,648 కిలోమీటర్ల మేర నడిచా.13 జిల్లాల్లోని ప్రజల కష్టాలు విన్నా. ప్రతి కుటుంబం పడుతున్న బాధను కళ్లారా చూశా. నాడు హోరున వర్షంలో పాదయాత్రలో వెంట నడిచారు. ఇవాళ మండుటెండను సైతం లెక్కచేయకుండా తరలి వచ్చారు. నర్సీపట్నంలో మీ అందరి మధ్య ‘‘వైసీపీకి ఓటు వేయండి, ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి’’ అని అడిగే ముందు...మాకు అధికారం ఇస్తే....ఏం చేస్తామో చెబుతా. తల్లిదండ్రుల మీద చదువుల భారం లేకుండా చూస్తాం. అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో ప్రభుత్వ స్కూళ్లను పూర్తిగా మార్చేస్తాం.
వ్యవసాయాన్ని మళ్లీ పండుగ చేస్తాం. గిట్టుబాటు ధర అందిస్తాం. ఐదేళ్లలో ప్రతీ నిరుపేద కుటుంబాన్ని లక్షాధికారిని చేస్తా. అధికారంలోకి రాగానే వెంటనే 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఉద్యోగాల విప్లవం తీసుకువస్తాం. రాష్ట్రంలో ఎక్కడ చూసినా లంచాలే. మట్టి నుంచి ఇసుక దాకా దేన్నీ వదలకుండా దోచుకున్నారు. కులపిచ్చి లేని పరిపాలన ఇస్తాను. జలయజ్ఞానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందిస్తాం. మీ సమస్యలన్నీ నేను విన్నాను.. నేను ఉన్నాను అని ఈ వేదిక నుంచి మాట ఇస్తున్నా’ అని జగన్ ప్రకటించారు. దీంతో ఈ వైసీపీ శ్రేణులు, అభిమానులు ఒక్కసారిగా జై జగన్.. జై జగన్ నినాదాలతో హోరెత్తించారు.
నేను విన్నాను నేను ఉన్నాను : వైయస్ జగన్ @ysjagan#YSJaganElectionCampaign #VoteForFan #YSJaganSpeaks pic.twitter.com/wNkpqjDebS
— Harsha Vardhan Reddy (@HVRYSRCP) March 17, 2019