Pawan Kalyan: లక్ష్మీనారాయణ తోడల్లుడు కూడా జనసేనలో చేరిక
- వస్తూవస్తూ 'తోడు' తెచ్చుకున్న సీబీఐ మాజీ జేడీ
- జనసేనలోకి ఎస్కే వర్శిటీ మాజీ వీసీ రాజగోపాల్
- సాదర ఆహ్వానం పలికిన పవన్
ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. అంగబలం, అర్థబలం ఉన్నవాళ్లు టీడీపీ, వైఎస్సార్సీపీల వైపు చూస్తుంటే, మేధావులు, భిన్నరంగాల ప్రముఖులు జనసేన వైపు అడుగులేస్తున్నారు. ఆదివారం ఉదయం సీబీఐ మాజీ జాయింట్ డైరక్టర్ లక్ష్మీనారాయణ జనసేన తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. విజయవాడ జనసేన కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాజీ జేడీ లక్ష్మీనారాయణను సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు.
కాగా, లక్ష్మీనారాయణ తోడల్లుడు, శ్రీకృష్ణదేవరాయ యూనివర్శిటీ మాజీ వైస్ చాన్సలర్ కూడేరు రాజగోపాల్ కూడా ఇదే సమయంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. తోడల్లుళ్లు ఇద్దరినీ పవన్ కల్యాణ్ ఈ సందర్భంగా అభినందించారు. కాగా, రాజగోపాల్ గతేడాది వీసీ పదవికి రాజీనామా చేశారు. అప్పటినుంచి లక్ష్మీనారాయణతో కలిసి రాజకీయ రంగప్రవేశంపై సమాలోచనలు చేస్తున్నారు. అంతకుముందే, లక్ష్మీనారాయణ కూడా స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. దాంతో, లక్ష్మీనారాయణ ప్రజలకు సేవ చేసే ఉద్దేశంలో ఉన్నారని, ఆయనతో పాటు నడించేందుకు తాను కూడా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు అప్పట్లో రాజగోపాల్ తెలిపారు.