Telangana: ఐదేళ్ల నాటి తెలంగాణను గుర్తు చేసుకుంటే భయమేస్తుంది: సీఎం కేసీఆర్
- ఆనాడు విద్యుత్ సరఫరా సక్రమంగా లేదు
- నేడు అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మోడల్ గా ఉంది
- గోదావరి నీళ్లతో తెలంగాణ భూములు తడవాలి
ఐదేళ్ల కిందటి తెలంగాణను గుర్తు చేసుకుంటే భయమేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ వేదికగా లోక్ సభ ఎన్నికల ప్రచారానికి టీఆర్ఎస్ శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, ఆనాడు విద్యుత్ సరఫరా సక్రమంగా లేక ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయాయని, ఆనాడు ప్రాజెక్టులు కట్టాలంటే దశాబ్దాల కాలం పట్టేదని అన్నారు.
ఐదేళ్ల నాటి తెలంగాణకు ఇప్పటి తెలంగాణకు చాలా తేడా ఉందని, అన్ని రంగాల్లో తెలంగాణ రోల్ మోడల్ గా ఉందని, విద్యుత్ రంగంలో అద్భుతం సృష్టించామని చెప్పారు. ఆరు నెలల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే కరీంనగర్ జిల్లా అమృతధారలా ఉంటుందని, దేవాదుల, మేడిగడ్డ, ఎల్లంపల్లి ప్రాజెక్టులు పూర్తయితే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. గోదావరి నీళ్లతో తెలంగాణ భూములు తడవాలని మొక్కుకునే వాడినని అన్నారు.
జాతీయ పార్టీలతో ఎటువంటి ఉపయోగం లేదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రం ఒక్కటైనా ఉందా? అని ప్రశ్నించారు. ఈ విషయమై ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలను అడుగుతున్నానని, దమ్ముంటే సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. కేంద్రం నిధులు ఇచ్చే విషయంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నిధులే మన రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు.
దేశానికి దారుణ గతి పట్టించింది కాంగ్రెస్, బీజేపీలేనని నిప్పులు చెరిగారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు లభిస్తున్నా, సాగుకు నీరు ఇవ్వలేదని, 2004లో ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ నేటికీ పంచాయితీ తేల్చలేదని, రెండు నెలల్లో తేల్చాల్సిన నీటి పంచాయితీలు పదిహేనేళ్లు గడిచినా పరిష్కారం కాలేదని మండిపడ్డారు. దేశంలో 30 వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రాలు మూతపడి ఉన్నాయని విమర్శించారు.