Telangana: ఏం చేస్తామో ఎన్నికల తర్వాత తెలుస్తుంది: సీఎం కేసీఆర్
- మా వెంట 100 మందికి పైగా ఎంపీలు ఉన్నారు
- బీజేపీ, కాంగ్రెస్ పాలన నుంచి ముక్తి లభించాలి
- ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపిస్తా
బీజేపీ, కాంగ్రెస్ పార్టీ వెనుక నడిచేందుకు అన్ని పార్టీలు సిద్ధంగా లేవని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. కరీంనగర్ లో ఈరోజు నిర్వహించిన లోక్ సభ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ, పదహారు ఎంపీ సీట్లతో తాము ఏం సాధిస్తానని వెటకారంగా మాట్లాడుతున్నారని, తమ వెంట 100 మందికి పైగా ఎంపీలు ఉన్నారని అన్నారు.
తాము ఏం చేయబోతున్నామో, లోక్ సభ ఎన్నికల తర్వాత తెలుస్తుందని, వేరే దేశాల గురించి మాట్లాడుకోవడం తప్ప, మన దగ్గర చేస్తోంది ఏమీ లేదని, ఈ దిక్కుమాలిన దరిద్రుల చేతుల్లో పడి దేశం బాధపడుతోందంటూ కాంగ్రెస్, బీజేపీలపై నిప్పులు చెరిగారు. దేశం బాగుపడాలంటే ఎక్కడో ఒక చోట పొలికేక రావాలని, దేశంలో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కావాలని అన్నారు. ప్రజలు దీవించి పంపిస్తే ఈ దేశం తలరాత మారుస్తానని, దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తానని కేసీఆర్ అన్నారు.
దేశానికి అనేక రంగాల్లో తెలంగాణ దిక్సూచిగా నిలుస్తోందని, ఇంకా మార్పు తీసుకురావాలని అన్నారు. ఒకవేళ అవసరమైతే జాతీయ పార్టీని కూడా స్థాపిస్తానని, పోరాటాల గడ్డ అయిన కరీంనగర్ నుంచి ఈ విషయాన్ని తెలియజేస్తున్నానని, ప్రజల దీవెనలతో దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు తన చివరి రక్తపుబొట్టు వరకు ప్రయత్నిస్తానని, బీజేపీ, కాంగ్రెస్ ముక్త్ భారత్ కావాలని పిలుపు నిచ్చారు.