korutla: ఆమె చూపించిన ఈ ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటాను: ఎంపీ కవిత

  • ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం టీఆర్ఎస్ కు విరాళం
  • కవితకు రూ.5000 అందజేసిన మున్సిపల్ వర్కర్
  • సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన కవిత

లోక్ సభ ఎన్నికల ప్రచార ఖర్చు నిమిత్తం టీఆర్ఎస్ పార్టీకి కోరుట్లకు చెందిన మున్సిపల్ వర్కర్ రజినీ విరాళంగా రూ.5000 అందజేశారు. ఈ విరాళాన్ని అందుకున్న ఎంపీ కవిత హర్షం వ్యక్తం చేశారు. ఆమె చూపించిన ఈ ప్రేమాభిమానాలకు రుణపడి ఉంటానంటూ సంతోషం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు.కాగా, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావుతో కలిసి కవిత ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ పార్టీ ఏ హామీలైతే ఇచ్చిందో వాటన్నింటినీ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు. రాజకీయ పార్టీలు, నాయకుడనే వాడు చెప్పిన మాటపై నిలబడి ఉంటే, భవిష్యత్ తరానికి ఉపయోగపడటమే కాకుండా స్ఫూర్తి నిచ్చే విధంగా ఉంటుందని అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని గమనిస్తే, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇచ్చిన మాటను ఇచ్చినట్టుగా అమలు చేసిన పరిస్థితి లేదని విమర్శించారు.

స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి పాలించిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ కావచ్చు ప్రజల కలలను నెరవేర్చలేదని అన్నారు. నాడు  ఇందిరాగాంధీ ‘గరీభీ హఠావో’ అన్న నినాదమిచ్చారని, ఇప్పుడు, ఆమె మనవడి తరం వచ్చినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రాలేదని విమర్శించారు. ఇక, బీజేపీ గురించి చెప్పాలంటే.. ఐదేళ్ల క్రితం అధికారంలోకి వచ్చే సమయంలో రాష్ట్రాలకు ఎక్కువ అధికారాలు ఇవ్వాలని, రెండు కోట్ల మంది యువతకు ఉపాధి కల్పిస్తామని, భారతీయులు విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్లధనం తీసుకొస్తానని, మహిళలకు పార్లమెంట్ లో 33 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని.. ఇలా చాలా హామీలిచ్చిన మోదీ వాటన్నింటిని మర్చిపోయారని విమర్శించారు. ఎన్నికల సందర్భంలో చెప్పే మాటలను కేవలం మాటలుగానే ప్రజలు భావించే దుస్థితికి తీసుకొచ్చింది ఈ జాతీయపార్టీలేనని మండిపడ్డారు.





  • Loading...

More Telugu News