Reliance: గండం నుంచి గట్టెక్కించారంటూ అన్నావదినలకు థ్యాంక్స్ చెప్పిన అనిల్ అంబానీ
- బకాయిల చెల్లింపులో మద్దతుకు ధన్యవాదాలు
- కష్టకాలంలో ఆదుకున్నారు
- ఇకముందూ మా అనుబంధం కొనసాగుతుంది
రిలయన్స్ కమ్యూనికేషన్స్ ఆర్ కామ్ సంస్థకు చెందిన రూ.462 కోట్ల బకాయిలను సకాలంలో చెల్లించడంతో అనిల్ అంబానీ ఊపిరి పీల్చుకున్నారు. ఈ సందర్భంగా తన అన్నావదినలు ముఖేష్ అంబానీ, నీతా అంబానీలకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. ఆపద సమయంలో ఆదుకున్నారని, వారి అండదండల వల్లే తాను బకాయిలు చెల్లించగలిగానని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
"మా అన్నయ్య ముఖేష్, మా వదిన నీతాలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. కష్టకాలంలో నా వెన్నంటి ఉన్నారు. కుటుంబ సభ్యుల మధ్య అనుబంధాలకు నిదర్శనంగా నిలిచారు. నేను నా కుటుంబం ఇకమీదట కూడా ఇలాగే కొనసాగుతాం. ముఖేష్, నీతా చేసిన సాయం హృదయాన్ని తాకింది" అంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
స్వీడన్ కు చెందిన ఎరిక్సన్ కంపెనీకి పాత బకాయిల కింద రూ.571 కోట్లు చెల్లించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో అప్పటికే నష్టాలతో సతమతమవుతున్న అనిల్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ముందుగా మార్చి 19లోపు 450 కోట్లు చెల్లించకపోతే మూడు నెలల జైలుశిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, గడువుకు ఒకరోజు ముందే మార్చి 18న బకాయిలు చెల్లించి పరువు కాపాడుకున్నారు అనిల్ అంబానీ. అనిల్ తాజా ప్రకటన నేపథ్యంలో ఆ డబ్బును ముఖేష్ అంబానీ సమకూర్చినట్టు తెలుస్తోంది.