sumalatha: రజనీకాంత్, చిరంజీవి సూచనల మేరకే ముందడుగు వేస్తున్నా: సుమలత
- అంబరీష్ మరణం తర్వాత జీవితం శూన్యంలా అనిపించింది
- అభిమానులు నాకు ధైర్యం చెప్పారు
- రెండు నెలల పాటు ఆలోచించి, రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకున్నా
తాను రాజకీయాల్లోకి వెళ్లడమే సరైన నిర్ణయమని రజనీకాంత్, చిరంజీవి తనకు సూచించారని ప్రముఖ సినీనటి, దివంగత అంబరీష్ భార్య సుమలత తెలిపారు. వారి సూచన మేరకే తాను రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నానని చెప్పారు. అయితే, తన తరపున వారు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా, లేదా అనే విషయం మాత్రం ఇంత వరకు చర్చకు రాలేదని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటకలోని మాండ్య స్థానం నుంచి సుమలత స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సుమలత మాట్లాడుతూ, మాండ్య ప్రజల అభిమానంతోనే ఎన్నికల్లో తాను పోటీ చేస్తున్నానని చెప్పారు. అంబరీష్ మరణాన్ని ఇప్పటికీ తాను జీర్ణించుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. అంబరీష్ లేని జీవితం శూన్యమని తాను భావించానని... కానీ, నిరాశలో ఉన్న తనకు అభిమానులు ధైర్యాన్ని ఇచ్చారని, ప్రజా జీవితంలో ఉండాలని సూచించారని చెప్పారు. రెండు నెలల పాటు భవిష్యత్తుపై ఆలోచించి, చివరకు రాజకీయాల్లోకి రావాలనే నిర్ణయానికి వచ్చానని తెలిపారు.
తాను ఎవరిపైనా విమర్శలు చేయబోనని, తనపై కొందరు చేసిన విమర్శలను పట్టించుకోబోనని సుమలత చెప్పారు. బెంగళూరు ఉత్తర, దక్షిణ స్థానాల్లో పోటీ చేయాలని, ఎమ్మెల్సీ పదవి ఇస్తామని తనకు ఆఫర్లు వచ్చాయని... కానీ, మాండ్య ప్రజల కోసం ఇక్కడి నుంచే పోటీ చేయాలనే నిర్ణయానికి తాను వచ్చానని తెలిపారు. 20వ తేదీన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేస్తానని చెప్పారు.